ఫేస్ బుక్ వచ్చాక వాస్తవమైనా..అవాస్తవమైనా క్షణాల్లో అందరికీ చేరిపోతోంది. కానీ ఫేక్ న్యూస్ లు మాత్రం ఇబ్బంది తెచ్చిపెడుతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ సీఐ రాజులపాటి అంకబాబు.. తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారని ఫేస్ బుక్‌లో ఫేక్ న్యూస్‌ని పోస్ట్ చేశారు. దీంతో యావత్ జిల్లా పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అంకబాబుకు ఫోన్ల మీద ఫోన్లు చేశారు. అటు ఆయన సన్నిహితులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన సూసైడ్ వార్త ఫేక్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఫేక్ న్యూస్‌పై సీఐ అంకబాబు ) ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ రాహుదేవ్ శర్మను కలిశారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. ఈ పని చేశారని వివరించారు.
ఏలూరు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం సీఐ అంకబాబు మీడియాతో మాట్లాడారు. ఇదంతా ఫేక్ న్యూస్ అని.. ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తాను క్షేమంగానే ఉన్నానని సీఐ అంకబాబు స్పష్టం చేశారు. ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూస్ పోస్ట్ చేసేటప్పుడు నిర్ధారించుకుని పోస్ట్ చేయాలని సూచించారు. నిర్ధారించుకోకుండా ఫేక్ న్యూస్‌ని ఫార్వర్డ్ చేసిన వారి మీద కూడా చట్టపరమైన చర్యలు తప్పవని అంకబాబు వార్నింగ్ ఇచ్చారు.