అమెరికాలో జాత్యంహకార ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ఇదిలావుంటే అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి పోలీసుల జాత్యంహకార చర్యలు వివాదాస్పదమైంది. మూడేళ్ల కిందట నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా, మెంఫిస్ నగరంలో టైర్ నికోలస్ (29) అనే యువకుడిపై పోలీసులు అమానుషంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నికోలస్ మృతి చెందాడు. మృతుడు, దాడిచేసిన పోలీసులూ నల్లజాతీయులే కావడం గమనార్హం. దాడికి సంబంధించిన ఫుటేజ్‌ను అధికారిక వర్గాలు విడుదల చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత హృదయవిదారక దృశ్యాలపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతోనే మెంఫిస్ పోలీసులు టైర్ నికోలస్‌ను అడ్డుకున్నట్టు తొలుత మీడియాలో కథనాలు వచ్చాయి. ప్రస్తుతం విడుదలైన వీడియోలో మాత్రం అతడు ఏ తప్పు చేయకపోయినా పోలీసులు కర్కశకంగా వ్యవహరించడం స్పష్టంగా కనబడుతోంది. ముందుగా నికోల్స్‌ను కారు లోంచి బయటకు లాగిన పోలీసులు.. అతడి చేతులు విరగ్గొట్టమని ఒకరు ఆదేశించడం.. అనంతరం రోడ్డుపై పడేసి కాళ్లతో తొక్కిపెట్టడం వీడియోలో ఉంది. వారి నుంచి తప్పించుకుని పరుగులు పెడుతున్న అతడ్ని వెంబడించారు.
అతడు పట్టుబడిన వెంటనే పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రిక్ షాకిచ్చే వెపన్ ఉపయోగించారు. నిర్దయగా చాలాసేపు ముష్టిఘాతాలు కురిపించారు. బాధతో విలవిల్లాడిపోయిన బాధితుడు.. తనను వదిలేయమని ప్రాధేయపడడం వీడియోల్లో వినిపిస్తోంది. అనంతరం తీవ్రంగా గాయపడిన నికోల్స్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జనవరి 7న ఈ ఘటన చోటుచేసుకోగా.. చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత 10న మృతి చెందాడు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులపై సెకండ్ డిగ్రీ హత్యా నేరం కింద కేసు నమోదయ్యింది.
నికోల్స్ మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో శుక్రవారం శాంతియుత ప్రదర్శనలు కొనసాగాయి. మెంఫిస్ నగరం మొత్తం స్తంభించిపోయింది. పాఠశాలలు, క్రీడా పోటీలు, వ్యాపార సముదాయాలను మూసివేశారు.
దారుణంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసుల్ని సస్పెండ్ చేశారు. ‘‘అందరి శ్రేయస్సు కోసం స్కార్పియన్ యూనిట్‌ను శాశ్వతంగా నిష్క్రియం చేశాం..ప్రస్తుతం యూనిట్‌కు కేటాయించిన అధికారులపై చర్యలను నిస్సందేహంగా అంగీకరిస్తున్నారు’ అని మెంఫస్ పోలీస్ విభాగం ప్రకటించింది. నికోలస్ కుటుంబం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది.. ‘‘టైర్ నికోలస్ విషాద మరణానికి ఇది సరైన చర్య.. అలాగే మెంఫిస్ పౌరులందరికీ దీని వల్ల మంచి జరుగుతుంది.. ఇది న్యాయమైన నిర్ణయం’’ అని పేర్కొంది.