ఒడిశా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి నబకిశోర్ దాస్‌పై పోలీస్ అధికారి కాల్పులకు పాల్పడిన ఘటన ఈ రాష్ట్రంలో తీవ్ర కలకలంరేపింది. రాష్ట్రంలోని ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజ్‌రాజ్‌నగర్‌లో ఏఎస్ఐ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలు కావడంతో హుటాహటిన సమీప ఆసుపత్రికి తరలించారు. మంత్రి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బ్రిజ్‌రాజ్‌నగర్‌లోని గాంధీ చౌక్ వద్ద ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ తన సర్వీస్ రివాల్వర్‌తో మంత్రిపై కాల్పులకు పాల్పడ్డాడు. దాడికి కారణమేంటనే విషయం తెలియరాలేదు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రిపై ఏఎస్ఐ గోపాల్ దాస్ కాల్పులు జరిపాడని బ్రజ్‌రాజ్ నగర్ సబ్-డివిజినల్ పోలీస్ అధికారి గుప్తేశ్వర్ భాయ్ తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మంత్రిని మెరుగైన వైద్యం కోసం మంత్రిని హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
మంత్రి తన వాహనంలో నుంచి దిగుతుండగా ఒక్కసారి కాల్పుల జరగడంతో అక్కడున్నవారు ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు. బీజేడీ సీనియర్ నేత అయిన నబ కిశోర్ దాస్.. ఇటీవల మహారాష్ట్రలోని శని శింగణాపుర్ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచారు. కాగా, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. మంత్రిపై దాడి జరగడం పార్టీలోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యింది. అయితే, ఒడిశాలో ఎన్నికల సమయంలో ఇటువంటి హింసాత్మక ఘటనలు తరచూ జరుగుతుంటాయని, ఇవి ఆందోళన కలిగించే విషయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ మొదలుపెట్టినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.