ఇటీవల విమానాలో అవాంచనీయ ఘటనలు ఎక్కువైపోతున్నాయి. సాధారణంగా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు మనం దిగాల్సిన స్టాప్ దాటిపోతే కండక్టర్ని రిక్వెస్ట్ చేసి బస్ దిగి వెళ్లిపోతాం. అలాగే ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మనకు ఎక్కడ దిగాలనిపిస్తే అక్కడ దిగేస్తాం. మరి విమానంలో ప్రయాణించేటప్పుడు అటువంటి అవకాశం ఉండదు. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం విమానంలో ప్రయాణించేటప్పుడు.. మధ్యలోనే దిగిపోతానంటూ హంగామా సృష్టించిన ఘటన ఇండిగో విమానంలో జరిగింది. విమానం ఎక్కిన తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఆ ప్రయాణికుడు తాను దిగిపోతానంటూ నానా రచ్చ చేశాడు. అంతే కాదండోయ్ ఆ ప్రయాణికుడు ఏకంగా గాలిలో ఎగురుతున్న విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి కూడా ప్రయత్నించాడు. దీంతో ఆ విమానంలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా తీవ్రభయంతో బెంబేలెత్తిపోయారు.
నాగ్‌పూర్ నుంచి ముంబయి వెళ్తున్న ఇండిగో విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే వెంటనే స్పందించిన సిబ్బంది.. ఆ ప్రయాణికుడిని నివారించేందుకు ప్రయత్నించారు. ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయత్నిస్తూ విమానంలో గందరగోళ పరిస్థితిని ఏర్పర్చటంతో.. హెచ్చరించి అతని సీట్లో కూర్చోబెట్టారు. అనంతరం పైలెట్‌కు సమాచారాన్ని అందించారు. ప్రయాణికుడు చేసిన హల్చల్కు విమానంలో ప్రయాణిస్తున్న మిగిలిన ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విమానం ల్యాండ్ అయిన అనంతరం సిబ్బంది ఆ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ భద్రత బలగాలకు అప్పగించారు.