మొగల్ గార్డన్ ఇకపై ‘అమృత ఉద్యాన్’గా పిలవబడుతుంది. ఇది నిజమే మరి. దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని ఉన్న మొఘల్ గార్డెన్ పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి దీనిని ‘అమృత ఉద్యాన్’గా పిలుస్తారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ఉత్సవాల నేపథ్యంలో మొఘల్ గార్డెన్ పేరు మారుస్తున్నట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నవికా గుప్తా వెల్లడించారు. అమృత ఉద్యాన్‌ను జనవరి 29న రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు. జనవరి 31 నుంచి మార్చి 26 వరకు రెండు నెలల పాటు సందర్శకులను అనుమతిస్తారని ఆయన చెప్పారు. సాధారణంగా ప్రతి ఏడాది ఈ గార్డెన్‌లోకి సందర్శకులను ఉద్యాన్ ఉత్సవాల సమయంలో నెల రోజులు మాత్రమే అనుమతిస్తారు.
మొఘల్ గార్డెన్ పేరుతో ఉన్న బోర్డులను బుల్డోజర్లతో తొలగించి వాటి స్థానంలో ‘అమృత ఉద్యాన్’ బోర్డులను ఉంచారు. ‘‘75 ఏళ్ల స్వాతంత్ర సంబరాలు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రపతి భవన్‌లోని మొఘల్ గార్డెన్‌కు.. రాష్ట్రపతి ముర్ము అమృత్ ఉద్యాన్ పేరును సూచించారు’’ అని నవికా గుప్తా పేర్కొన్నారు.
ఇక, రాష్ట్రపతి భవన్‌లో మొఘల్, పర్షియన్ ఉద్యానవనాల ప్రేరణతో మూడు గార్డెన్‌లు ఉన్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో అదే పేరుతో ఉన్న ఉద్యానవనాన్ని ప్రజలు, అధికారులు మొఘల్ గార్డెన్స్ అని పిలిస్తారు. కానీ ఆ ఉద్యానవనాలకు అధికారికంగా మొఘల్ గార్డెన్స్ అని పేరు పెట్టలేదు. 15 ఏకరాలకుపైగా విస్తీర్ణంలో ఉన్న మొఘల్ గార్డెన్‌ను రాష్ట్రపతి భవన్‌కు ఆత్మగా భావిస్తారు.
రాష్ట్రపతి భవన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. భారత్, పర్షియా పెయింటింగ్స్ నుంచి స్ఫూర్తితో జమ్మూ కశ్మీర్‌లోని మొఘల్ గార్డెన్స్, తాజ్ మహల్ చుట్టూ ఉన్న ఉద్యానవనాలను ఏర్పాటుచేశారు. అమృత్ ఉద్యాన్ ఇప్పటివరకు ఫిబ్రవరి-మార్చి నెలల్లో జరిగే వార్షిక ఉత్సవాల సమయంలో మాత్రమే ప్రజల కోసం తెరవబడింది. కానీ రాష్ట్రపతి భవన్ పర్యటన మూడో సర్క్యూట్‌గా ఏర్పడే గార్డెన్‌లు ఇప్పుడు ఆగస్టు నుంచి మార్చి వరకు అనుమతించనున్నారు.
ఇదిలా ఉండగా, మొఘల్ గార్డెన్ పేరు మార్చుతూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త పేరు వలసరాజ్యాల అవశేషానికి మరో చిహ్నాన్ని ముక్కలు చేయడమే కాకుండా అమృత్ కాలం పట్ల భారత్ ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు.