నాబార్డు సాయంతో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలు రాష్ట్ర భవిష్యత్‌కు మంచి బాటలు వేస్తున్నాయని సీఎం జగన్ అన్నారు. శనివారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నాబార్డు చైర్మన్ షాజి కేవీ, సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా నాబార్డు సహాయంతో చేపడుతున్న వివిధ కార్యక్రమాల అమలుపై చర్చ జరిగింది. నాబార్డు సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు మహిళా సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలు రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తున్నాయని సీఎం తెలిపారు. భవిష్యత్‌లో కూడా ఇదే విధంగా తోడ్పాటు అందించాలని నాబార్డు చైర్మన్‌ని కోరారు. విద్యారంగంలో నాడు-నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలతో పాటు కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని నాబార్డు చైర్మన్ షాజి ప్రశంసించారు.