రోడ్డు ప్రమాదంలో ఇంటి యజమానిని కోల్పోయిన కుటుంబానికి హైకోర్టు అండగా నిలిచింది. మృతుడి కుటుంబానికి పరిహారం చెల్లింపు విషయంలో ప్రమాద బీమా ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వుల(అవార్డు)ను సవరించి పరిహారాన్ని భారీగా పెంచింది. బాధిత కుటుంబానికి రూ.1.79 లక్షలు చెల్లించాలని ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను సవరిస్తూ, సదరు మొత్తానికి మరో రూ.4.10 లక్షలు కలిపి మొత్తం రూ.5.89 లక్షలు చెల్లించాలని బీమా కంపెనీ సహా ప్రమాదానికి కారణమైన ఆటోడ్రైవర్‌కి స్పష్టం చేసింది. మృతి చెందిన వ్యక్తి ఆదాయాన్ని మదింపు చేయడంలో ట్రైబ్యునల్ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. ట్రైబ్యునల్ ఇచ్చిన పరిహారం ఉత్తర్వులపై బాధిత కుటుంబ సభ్యులు అప్పీల్ వేయకున్నా, పరిహారం సొమ్మును పెంచే అధికారం అప్పీల్ కోర్టుకు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేసింది. బాధిత కుటుంబం కోరినదానికన్నా ఎక్కువ పరిహారం చెల్లించకూడదనే నిబంధన ఎక్కడా లేదని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఇటీవల తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా, అమరావతి మార్కెట్ వద్ద 2005లో లాలూనాయక్ అనే వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆయనను ఓ ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన లాలూనాయక్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆటోడ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో కుటుంబ పెద్దను కోల్పోయిన తమకు రూ.2 లక్షల పరిహారం ఇప్పించాలని కుటుంబ సభ్యులు గుంటూరులోని ప్రమాద బీమా ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. దీంతో రూ.1.79 లక్షల పరిహారం చెల్లించాలని ఆటోడ్రైవర్, బీమా సంస్థలను ఆదేశిస్తూ 2007లో ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ గుంటూరు డివిజనల్ మేనేజర్ హైకోర్టులో అప్పీల్ వేశారు. బీమా సంస్థ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. డ్రైవర్ వద్ద లైట్ మోటర్ నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉందన్నారు. ఆ లైసెన్సు ఆధారంగా ఆటో నడపడానికి నిబంధనలు అంగీకరించబోవని తెలిపారు. ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. మృతుడి సతీమణి, కుమారుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మృతుడి నెలవారీ ఆదాయాన్ని ట్రైబ్యునల్ సరిగా మదించలేదన్నారు. నెలకు రూ.1200 ఆదాయంగా లెక్కించి తక్కువ పరిహారం మంజూరు చేసిందని తెలిపారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులపై తాము అప్పీల్ వేయకపోయినా పరిహారం సొమ్ముపెంచే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. ఆ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. చట్టనిబంధనల ప్రకారం ఎల్‌ఎంవీ లైసెన్స్ ఉన్న వ్యక్తి ఆటో నడపవచ్చునని తెలిపారు. మృతుడి ఆదాయం నెలకు రూ.4500గా లెక్కగట్టి మొత్తం రూ.5.89 లక్షలు చెల్లించాలని బీమా సంస్థ, ఆటోడ్రైవర్‌లను న్యాయమూర్తి ఆదేశించారు. బీమా సంస్థ అప్పీల్‌ను కొట్టేశారు.