రాష్ట్రంలో తోడేళ్లందరూ ఒక్కటవుతున్నా..మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తున్నాడని ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో ముసలాయన పాలనలో గజ దొంగల ముఠా ఉండేదని, వారు దోచుకో, పంచుకో, తినుకో అన్న విధానంలో పని చేశారన్నారు. మీ బిడ్డ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నాబీసీలు, నా మైనారిటీలు అంటూ అన్నివర్గాలకు తోడుగా నిలిచారన్నారు. నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద కుటుంబానికి ఎంతో మేలు జరుగుతోందని చెప్పారు. ఇది పేదవాడికి, పెత్తందారుకి మధ్య నడుస్తున్న యుద్ధం. మాట ఇస్తే నిలబడే వ్యక్తి ఒక వైపు ఉంటే, వెన్నుపోట్లు, మోసాలు చేసే తోడేళ్లు మరో వైపు ఉన్నారు. ఎటు వైపు ఉండాలో మీరే నిర్ణయించుకోండి. మంచి చేసే అవకాశం ఇవ్వండి. మీ అందరి చల్లటి దీవెనలతో నడుస్తున్నా. మీ బిడ్డకు ఉన్న నమ్మకం ఒక్కటే మీ అందరి ఆశీస్సులు, దేవుడి చల్లటి దీవెనలు ఉన్నాయి అని సీఎం జగన్ పేర్కొన్నారు. జగనన్న చేదోడు పథకం కింద లబ్దిదారులకు మూడవ విడత సాయాన్ని ఇవాళ పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు.