ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోనే తమ ప్రయాణం..నెల్లూరులో వైసీపీకి మేయర్ ఝలక్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 04, 2023, 06:52 PM

నెల్లూరు జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి ఝలక్ ఇచ్చారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోనే తమ ప్రయాణమని నెల్లూరు మేయర్‌ స్రవంతి ప్రకటించారు. అవసరమైతే నెల్లూరు మేయర్ పదవికి రాజీనామా చేస్తామని వెల్లడించారు. కార్పొరేటర్‌‌గా, మేయర్‌గా తాను ఎదగడానికి కోటంరెడ్డే కారణమని స్పష్టం చేశారు. ‘‘మా జెండా.. మా ఊపిరి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఆయన ఎటుంటే అటే నడుస్తాం’’ అని ఆమె తేల్చి చెప్పారు. శ్రీధరన్నతోనే తన రాజకీయ ప్రయాణమని మేయర్‌ అన్న మాటలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలించి పోయారు.


ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇటీవల నిర్వహించిన ప్రెస్మీట్లకు మేయర్ భర్త కూడా వచ్చారు. శనివారం నిర్వహించిన ప్రెస్మీట్‌లో తొలిసారి మేయర్ స్రవంతిని కూడా పక్కన కూర్చున్నారు. తద్వారా తన వెంట ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని కోటంరెడ్డి పరోక్షంగా వెల్లడించారు.


ఈ సందర్భంగా నెల్లూరు మేయర్ స్రవంతి మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయం నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి అండగా నిలిచారని గుర్తు చేశారు. ఆ తర్వాత నెల్లూరు మేయర్ పదవి రిజర్వేషన్లో తనకు వచ్చేలా సాయపడ్డారని, కార్పొరేటర్‌గా తన గెలుపునకు కోటంరెడ్డి కృషి చేశారని చెప్పారు. అలాంటి అన్నను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోనని స్పష్టం చేశారు. తాము ఎప్పటికీ కోటంరెడ్డి వెంటే ఉంటామన్నారు. ఆయన రాజీనామా చేయాలని చెబితే వెంటనే తన పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. బాధతో కాదు, సంతోషంగా తన పదవికి రాజీనామా చేస్తానని మేయర్ పొట్లూరి స్రవంతి ప్రకటించారు.


నెల్లూరు కార్పొరేషన్‌కి సంబంధించి రూరల్ నియోజకవర్గ పరిధిలో 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. గత ఎన్నికలకు ముందు వరకు గృహిణిగా ఉన్న పొట్లూరి స్రవంతి తన భర్త అడుగు జాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఈ దఫా రూరల్‌కి మేయర్ పదవి ఇచ్చి, సిటీ నియోజకవర్గానికి చెందిన రూప్ కుమార్ యాదవ్‌కు డిప్యూటీ మేయర్ పదవి అప్పగించారు. ఈ క్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చొరవతో స్రవంతి మేయర్ అయ్యారు. తొలి నుంచీ కోటంరెడ్డి కుటుంబంతో ఉన్న స్రవంతి దంపతులు.. తాజాగా, కోటంరెడ్డి వైసీపీని వీడిపోవడానికి సిద్ధం కావడంతో మేయర్ కూడా ఆయన వెంటే నడుస్తానని ప్రకటించారు.


ఇదిలావుంటే గత కొద్ది రోజులుగా తనపై నిఘా పెట్టి ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారని వైసీపీ అధిష్టానంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com