దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మృతిపై విచారణ జరిపించాలని గుడివాడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ మృతిపై మిస్టరీ వీడాలన్నారు. ఎన్టీఆర్ ఈ రాష్ట్ర సంపద అని, ఆయన ఎలా చనిపోయారో అందరికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్టీఆర్ డెత్ మిస్టరీ తేల్చాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలు రాస్తానని కొడాలి నాని వెల్లడించారు. ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్లు, హార్ట్ అటాక్‌లు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. వీటన్నింటిపైనా కూడా విచారణ చేయాల్సిందేనని కేంద్రంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను కోరాతనని వెల్లడించారు.
ఇక, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు హంతకులను పట్టుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. వివేకా హత్య కేసుతో చంద్రబాబు, లోకేష్, అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీ, కడప జిల్లా ఎస్పీతో పాటు టీడీపీ నేతల ఫోన్ కాల్స్ పైనా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. వివేకా హత్యకు ముందు ఆ తర్వాత వీళ్లంతా ఏమేం మాట్లాడుకున్నారో కూడా విచారణ చేయాలన్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న లోకేష్.. ముందు తన బాబాయ్ సంగతి చెప్పాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. చంద్రబాబు తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు ఏమైపోయాడో కూడా ప్రజలకు లోకేష్ చెప్పాలన్నారు. సొంత అన్నయ్య చంద్రబాబుకు వ్యతిరేకంగా శాసనసభ్యుడిగా పోటీ చేసి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన నీ సొంత బాబాయ్ రామ్మూర్తి నాయుడు ఎక్కడున్నారు, ఏం చేశారని నిలదీశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందనే విషయాన్ని చెప్పేందుకు జగన్మోహన్ రెడ్డికి, ఆయన సతీమణి భారతికి ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేస్తే చంద్రబాబు అనుకూల మీడియా కావాలనే తప్పుదారి పట్టిస్తోందని కొడాలి నాని మండిపడ్డారు. పార్టీకి సంబంధించిన వాళ్లు ఎవరైనా జగన్‌తో మాట్లాడాలంటే ఆయన ఇంటి దగ్గర ఉండే నవీన్‌కి, ఆఫీసులో కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ చేస్తారని వివరించారు. ఫోన్ చేసి మాట్లాడినా కూడా అందరిని ఇందులోకి లాగేందుకు చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు.