రాష్ట్ర ఖజానాను వైసిపి నాయకులు దోచుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని గద్దెదించాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. శనివారం సాలూరు నియోజకవర్గం మెంటాడ మండలంలోని లోతుగడ్డ పంచాయతీలో ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన మహిళలు ఆమెకు హారతులిచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర ధరలు, గ్యాస్, ఆయిల్ ధరలు పెరగడంతో సామాన్యులు బతకలేని పరిస్థతిలో ఉన్నారని చెప్పారు. గ్రోత్ రేటు పెరిగిందని చెబుతున్న వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక, రైతుల నుంచి ధాన్యం కొనలేక కుంటిసాకులు చెబుతోందని విమర్శించారు. నారా లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ వస్తోందని, దాన్ని చూసి ఓర్వలేని వైసిపి నాయకులు తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. ఆండ్ర పంచాయతీకి చెందిన వైసిపి వైస్ సర్పంచ్ దారి శ్రీను ఆధ్వర్యంలో వంద కుటుంబాలు సంధ్యారాణి సమక్షంలో టిడిపిలో చేరాయి. కార్యక్రమంలో టిడిపి నాయకులు చలుమూరి వెంకటరావు, గెద్ద అన్నవరం, సూరెడ్డి కృష్ణమూర్తి, రెడ్డి ఎర్నాయుడు, పల్లి సింహాద్రి, సిరిపురపు గురునాయుడు తదితరులు పాల్గొన్నారు.