ఉగ్రవాదాన్నిపెంచి పోషించినందుకు ఇపుడు ఆ దేశంలోని ప్రముఖులే మనోవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే పెషావర్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో పెద్ద సంఖ్యలో పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదుల దుశ్చర్యను యావత్తు ప్రపంచం ముక్త కంఠంతో ఖండించింది. ఈ ఘటనపై పాక్ రక్షణ మంత్రి జాతీయ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ.. ఉగ్రవాదానికి మనమే బీజం వేశామని బహిరంగంగా అంగీకరించారు. తాజాగా, పేలుడు ఘటనపై పోలీస్ అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో పెరుగుతున్న తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో తాము బలిపశువులుగా మారుతున్నామని వాపోయారు.
పోలీసు యూనిఫాం ధరించిన ఆత్మాహుతి బాంబర్ సోమవారం పెషావర్‌లోని భారీ భద్రత ఉన్న కాంపౌండ్‌లోకి చొరబడి మసీదులో మధ్యాహ్నం ప్రార్థనల సమయంలో తనను తాను పేల్చేసుకున్నాడు. చాలా సంవత్సరాలుగా పాక్‌లో ఇలాంటి హేయమైన చర్యలు కొనసాగుతున్నాయి. ‘‘మేము షాక్‌లో ఉన్నాం.. ప్రతిరోజూ మా సహోద్యోగులు చనిపోతున్నారు.. మనం ఎంతకాలం బాధపడాలి?.. రక్షకులు సురక్షితంగా లేకపోతే దేశంలో ఎవరు సురక్షితంగా ఉంటారు’’ ఒక పోలీసు అధికారి నిలదీశారు.
తెహ్రిక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ జరిపిన ప్రతీకార దాడిలో సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ‘‘ఈ యుద్ధంలో మేము ముందున్నాం.. పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలను రక్షిస్తున్నాం.. కానీ ఇవాళ మేము ఒంటరపోయాం.. ప్రభుత్వం మా చేతులు కట్టేసి మృగాలకు విసిరేసింది’’ అని ఓ జూనియర్ అధికారి వాపోయారు.
కొద్ది నేలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరగడంతో దేశంలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితికి అద్దం పడుతోందని రాజకీయ నాయకులు విమర్శలు గుప్పిస్తుననారు. మరోవైపు, పాక్ కూడా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. తాము ఎదుర్కొంటున్న ముప్పుతో విసిగెత్తిపోయి పెషావర్‌లో కొంత మంది పోలీస్ అధికారులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఇది వర్ణనాతీతమైన బాధ అని ఆత్మాహుతి దాడిలో గాయపడిన ఇనాయత్ ఉల్లాహ్ అనే పోలీస్ ఆవేదన చెందాడు. మసీదు శిథిలాల కింద కొన్ని గంటలు పాటు చిక్కుకున్న ఆయన రెస్క్యూ ఆపరేషన్‌లో బయటపడ్డారు. ‘‘మేము మా ఇంటి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎక్కడ టార్గెట్ చేయబడతామో మాకు తెలియదు.. ఈరోజు అతడు.. రేపు నేను కావచ్చు’’ అని దాడిలో చనిపోయిన తన ప్రాణ స్నేహితుడ్ని తలచుకుని బాధపడ్డారు.
‘‘మేము ఇళ్లను విడిచిపెట్టిన ప్రతిసారీ మా ప్రియమైన వారిని హత్తుకుంటాం.. వారు మమ్మల్ని కూడా ఆలింగనం చేసుకుంటారు.. ప్రాణాలతో తిరిగి వెళ్తామోఝ లేదో? తెలియదు’’ అని ఆరుగురు స్నేహితుల్ని కోల్పోయిన మరో పోలీస్ కన్నీటిపర్యంతమయ్యారు. ఇక, 2013 పేలుడులో త్రుటిలో ప్రాణాలతో బయటపడిన అతిఫ్ ముజీద్ అనే మరో పోలీస్ అధికారి.. సోమవారం నాటి దాడిలో మాత్రం తప్పించుకోలేకపోయారు. తమ కుటుంబం అనాథ అయ్యిందని అతడి బావ మరిది కన్నీళ్లు పెట్టుకున్నారు.