ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని రుషి సునాక్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఇదిలావుంటే యూకే ప్రధాన మంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పీర్స్ మోర్గాన్ అనే జర్నలిస్ట్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు యూకే ప్రధాని సునాక్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. మీ ఆస్తి ఎంత..? మీరు బిలీనియరా? అని జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆర్థికంగా అదృష్టవంతుడిన్ని.. ఇప్పుడు నేను ఆ వివరాలు వెల్లడించదల్చుకోలేదు.. నా బ్యాంకు ఖాతాలో ఎంత ఉందన్నది ముఖ్యం కాదు. నా విలువలు ఏంటి? నేను తీసుకునే చర్యలు ఏంటనేది ఇక్కడ ముఖ్యం అని రిషి బదులిచ్చారు.
ఐరోపాలో యుద్ధ వాతావరణం, పౌండ్ విలువ పడిపోవడం, ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఆర్థిక సంక్షోభం వంటి సవాళ్లు ఉన్నా యూకే ప్రధాని పదవిని ఎందుకు చేపట్టాలనుకున్నారని ప్రశ్నించగా.. అనేక సవాళ్లు ఉన్నప్పటికీ, దేశానికి సేవ చేయడమే తన ధర్మం అని నమ్మి ఆ పదవిని అంగీకరించానని తెలిపారు. ‘‘లిజ్ ట్రస్ రాజీనామా చేసినప్పుడు నేను రాజకీయాల గురించి ఆలోచించలేదు... నేను ముందుకు వెళ్లాను.. నేను ప్రజా సేవను నమ్ముతాను.. అన్నిటికంటే ఎక్కువగా కర్తవ్య భావం కలిగి ఉన్నాను... హిందూమతంలో ధర్మం అనే ఒక భావన ఉంది.. అది స్థూలంగా కర్తవ్యాన్ని బోధిస్తుంది.. నేను అలా పెరిగాను’’ సునాక్ సమాధానం ఇచ్చారు.
‘‘మీ నుంచి ఆశించిన పనులను చేయడం.. సరైన పని చేయడానికి ప్రయత్నించడం.. ఇది ఒక పీడకల ఉద్యోగం అయినప్పటికీ, నేను ఒక వైవిధ్యంగా చేయగలనని భావించాను.. ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఆ సమయంలో వైవిధ్యం చూపడానికి నేనే అత్యుత్తమ వ్యక్తిని.. చివరికి నేను చేయడానికి ముందుకు వచ్చాను.. ఇది కష్టం.. సవాలుగా ఉంటుందని తెలుసు’’ అని సునాక్ వ్యాఖ్యానించారు.
‘‘నా విలువలు ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి.. ఈ దేశానికి నా తల్లిదండ్రులు వలసవచ్చారు.. వీలైనంత కష్టపడి పని చేయడం.. ప్రతిదాన్ని త్యాగం చేయడం ద్వారా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందనే మనస్తత్వం వారిది.. మేము బ్రిటన్ పౌరుల జీవితంలో కలిసిపోయాను.. నేను అలా పెరిగాను - కష్టపడి పనిచేయడం, సరైన పని చేయడం, నా కంటే తక్కువ అదృష్టవంతులతో పోల్చుకుంటాను.. ఈ ఉద్యోగానికి నేను తెచ్చిన విలువలు ఇవే’’ అని అన్నారు.
ప్రస్తుతం కన్జర్వేటివ్ పార్టీలోని ఇద్దరు అగ్రస్థాయి నేతల పన్ను వ్యవహారాలపై వివాదం చెలరేగుతున్న సమయంలో రిషి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. తన పన్ను వివరాలను వెల్లడించడానికి, తన ఆర్థిక విషయాలను పారదర్శకంగా ఉంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. భారతీయ మూలాలున్న రిషి సునాక్ గతేడాది అక్టోబరు 25న బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. రాబోయే ఏడాదికి సంబంధించి ప్రధానమైన అయిదు లక్ష్యాలను పేర్కొన్నారు. ద్రవ్యోల్బణ కట్టడి, ఆర్థికరంగం వృద్ధి, రుణ భారం తగ్గింపు, జాతీయ ఆరోగ్య సేవల నిరీక్షణ జాబితాను తగ్గించడం, అక్రమ వలసల నిరోధం అంశాలు అందులో ఉన్నాయి.