తనను లంచం అడిగి ఇవ్వనందుకు కులం పేరు తో తిట్టి కొట్టాడంటూ చాపల పద్మ అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు వేటపాలెం పంచాయతీ కార్యదర్శి ఆకుల హరిబాబు పై ఆదివారం ఎస్సీ ఎస్టీ కేసు నమోదయింది. వివరాలలోకి వెళితే. వేటపాలెంలోని తన సొంత ఇంటిని వేరే వారు కొనుక్కున్నట్లు, ఈ క్రమంలో ఇంటి పన్ను జాబితాలో తన పేరు మారకుండా చేసేందుకు కార్యదర్శి హరిబాబు తనను 50 వేల రూపాయలు అడిగాడని సదరు పద్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కానీ లంచం ఇవ్వడానికి తాను నిరాకరించానని తెలిపింది. తదుపరి ఇంటి పన్ను జాబితాలో తన పేరు కొట్టేసి అవతల వారి పేరును కార్యదర్శి చేర్చాడని తెలిపింది. ఈ విషయం అడగడానికి శనివారం పంచాయతీ కార్యాలయానికి తాను వెళితే తనను కులం పేరు పెట్టి కార్యదర్శి హరిబాబు దూషించి కొట్టినట్లు పద్మ ఇతర ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వేటపాలెం ఎస్సై సురేష్ మీడియాకు చెప్పారు.