దేశ వ్యాప్తంగా గౌతమ్ అదానీ షేర్ల పతనంపైనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఉభయ సభలను ‘అదానీ’ అంశం కుదిపేసింది. బడ్జెట్ తర్వాతి రోజు నుంచే ప్రతిపక్ష సభ్యులు అదానీ గ్రూపు కంపెనీలపై విచారణకు డిమాండ్ చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనంతటికీ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ అనే సంస్థ విడుదల చేసిన ఓ నివేదికే కారణం. అదానీ గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచేయడంతోపాటు, ఖాతాల్లో అవకతవకలకు పాల్పడుతోందన్నది హిండెన్ బర్గ్ ఆరోపణలు. దీన్ని అదానీ గ్రూప్ ఖండించింది. అవన్నీ ఆధార రహితాలంటూ కొట్టి పడేసింది.
మరోపక్క, ఇంతకాలం ప్రధాని మోదీ తన అనుకూలుడైన గౌతమ్ అదానీకి దోచి పెడుతున్నారంటూ ఆరోపణలకే పరిమితమైన ప్రతిపక్షాలకు తాజా అంశం బలాన్నిచ్చింది. దీంతో హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఆధారంగా పార్లమెంటరీ సంయుక్త కమిటీ విచారణకు డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ను స్తంభింపజేస్తున్నాయి. లేదంటే సుప్రీంకోర్టు సీజే పర్యవేక్షణలో కమిటీతో అయినా విచారణ చేయించాలని కోరుతున్నాయి.
ఇదే అంశంపై ప్రతిపక్షాలు సోమవారం కూడా లోక్ సభ, రాజ్యసభలోనూ తమ పట్టు వీడలేదు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు సభలు వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో సమావేశమైన విపక్ష ఎంపీలు అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబట్టాలని, సంయుక్త పార్టీమెంటరీ కమిటీతో విచారణ కోరాలని నిర్ణయించాయి. మరోపక్క, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలకు అనుమతించాలని అధికార బీజేపీ కోరింది. కానీ, ప్రతిపక్షాలేవీ శాంతించలేదు. అదానీ అంశాన్ని తేల్చేవరకు పార్లమెంట్ లో మరే ఇతర కార్యకలాపాలు జరగడానికి వీల్లేదని పట్టుబడుతున్నాయి.