'అదానీ ఇష్యూ అనేది ఒక కంపెనీ సమస్య అని, ఇది భారత దేశంపై జరిగిన దాడి అని ఎలా చెబుతారు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. ఇదిలావుంటే అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్.. ఇటీవల భారతదేశంలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసింది. భారత స్టాక్ మార్కెట్లో తీవ్ర అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు చేస్తోందని రిపోర్ట్ విడుదల చేసింది. రెండేళ్లకుపైగా పరిశోధన చేసినట్లు ఇందులో చెప్పుకొచ్చింది. అయితే.. ఈ సందర్భంగా అదానీ గ్రూప్‌కు 88 ప్రశ్నలు సంధించింది హిండెన్‌బర్గ్. దీనికి బదులిస్తూ.. 413 పేజీల్లో స్పందన తెలియజేసింది అదానీ గ్రూప్. ఈ సందర్భంగా.. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను భారత దేశంపై కుట్రగా అభివర్ణించింది అదానీ గ్రూప్. ఇదే సమయంలో జాతీయ వాదం ముసుగులో కుట్ర చేస్తున్నారని మరోసారి అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేసింది హిండెన్‌బర్గ్.
ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కొద్దిరోజులుగా విలేకరుల నుంచి పలు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ సమయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ''అదానీ ఇష్యూ అనేది ఒక కంపెనీ సమస్య అని, ఇది భారత దేశంపై జరిగిన దాడి అని ఎలా చెబుతారని అన్నారు. అదే జరిగితే.. భారతదేశంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఎందుకు వస్తున్నారు? వారికి భారతదేశంపై నమ్మకం, భారతదేశ నాయకత్వంపై నమ్మకం, కరోనా సమయంలో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతుంటే భారత్ చూపిన చొరవపై నమ్మకం.'' అని అన్నారు నిర్మలా సీతారామన్.
కొద్దిరోజుల కిందట నిర్మలమ్మ.. అదానీ ఇష్యూ గురించి పరోక్షంగా స్పందించారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై ఏ ప్రభావం చూపబోదని, భారత బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉందని, ఇంకా అదానీ గ్రూప్ రుణాల గురించి LIC, SBI ఇప్పటికే స్పందించాయని అన్నారు. అయితే .. ఇటీవల హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ను అదానీ గ్రూప్.. భారతదేశంపై కుట్రగా పేర్కొనగా, ఇప్పుడు నిర్మలా సీతారామన్ .. భారత్‌పై కుట్ర కాదని వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.