తాజాగా ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా పెద్ద ఎత్తున ఫ్రెషర్లను తొలగించినట్లు తెలుస్తోంది. కంపెనీ ఇంటర్నల్ ఫ్రెషర్ అసెస్‌మెంట్ టెస్ట్‌లో చాలా మంది పాస్ కాలేకపోయారని, ఈ నేపథ్యంలో సుమారు 600 మంది ఫ్రెషర్లను ఇన్ఫోసిస్ తొలగించినట్లు బిజినెస్ టుడే నివేదించింది. వీరిలో చాలా మందిని 2022, జులై తర్వాత నియమించుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గతేడాది ఆగస్టులో ఇన్ఫోసిస్‌లో చేరిన ఒక ఫ్రెషర్.. తనను కంపెనీ తీసేసిందని చెప్పాడు.
''గతేడాది ఆగస్టులో నేను ఇన్ఫోసిస్‌లో పని ప్రారంభించాను. స్ట్రీమ్‌లో నాకు ట్రైనింగ్ ఇచ్చారు. మొత్తం మా టీమ్‌లో 150 మంది ఉండగా.. కేవలం 60 మంది పాసయ్యారు. మిగతా అందరినీ రెండు వారాల కిందట తీసేశారు. 2022 జులైలో ఆన్‌బోర్డింగ్ అయిన మా టీంలో మొత్తం 85 మందిని టెర్మినేట్ చేశారు.'' అని కొద్దినెలల కిందటే ఇన్ఫోసిస్‌లో చేరిన ఉద్యోగి చెప్పుకొచ్చాడు. మొత్తం ఇన్ఫోసిస్ తీసేసిన 600 మందిలో 280 మందిని రెండు వారాల కిందటే తీసేసినట్లు తెలుస్తోంది.
ఇన్ఫోసిస్‌లో ఇప్పటికీ ఇంకా చాలా మంది ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూస్తు్న్నారు. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా.. చాలా మందిని ఎంపిక చేసి ఆఫర్ లెటర్స్ ఇచ్చి కూడా ఇంకా ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. వీటి గురించి గతేడాది నుంచే వార్తలొచ్చాయి. ఈ లిస్ట్‌లో విప్రో, టెక్ మహీంద్రా, టీసీఎస్ కూడా ఉన్నాయి. అయితే కంపెనీ.. ఈ ఆన్‌బోర్డింగ్ గురించి కనీసం టైమ్‌లైన్‌ను కూడా ప్రకటించకపోవడం గమనార్హం.
అయితే.. కంపెనీలో రిక్రూట్ చేసుకోవాలంటే.. అందులో ఇంటర్నల్ టెస్ట్‌లు కూడా కీలక పాత్ర పోషిస్తాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 6000 మందిని నియమించుకున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 50 వేల మందిని నియమించుకోవాలని టార్గెట్‌గా పెట్టుకోగా.. ఇప్పటికే 40 వేల మందిని నియమించుకుంది. మరో ఐటీ దిగ్గజం విప్రో కూడా జనవరిలో ఇంటర్నల్ టెస్ట్ క్లియర్ చేయలేకపోయారని.. 800 మందిని తీసేసినట్లు వార్తలొచ్చాయి.