సిరియా సరిహద్దుల్లోని దక్షిణ టర్కీలో భూకంపం సంభవించింది. ఈ భుకంపం రిక్టర్ స్కేల్‌పై 7.8గా నమోదయ్యింది. అనంతరం 6.7 తీవ్రతతో మరోసారి భూమి కంపించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. గజియాన్‌టెప్ ప్రావిన్సుల్లోని నుర్దగి నగరానికి తూర్పున 26 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్టు తెలిపింది. 17.9 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉందని పేర్కొంది. అలాగే, నిమిషాల వ్యవధిలోనే మధ్య టర్కీలో 9.9 కిలోమీటర్ల లోతులో రెండో భూకంపం వచ్చిందని అమెరికా జియోలాజికల్ సర్వే వివరించింది.
భూకంపం ధాటికి అనేక భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. అయితే, ఆస్తి, ప్రాణనష్టం గురించి ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. అయితే, భారీగా ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. భూకంపం తర్వాత భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్షతగాత్రులు ఆర్తనాదాలు, భయంతో పరుగులు తీయడం ఈ వీడియోల్లో కనబడుతోంది. ఇప్పటి వరకూ కనీసం 53 మంది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని, అనేక మంది భవన శిథిలాల కింద చిక్కుకుపోయారని పేర్కొన్నారు. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగారు. క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్నారు.