నెల్లూరు జిల్లా, కావలి రూరల్ మండలం చెన్నాయపాలెం సముద్ర తీరం నుంచి సముద్రంలోకి విహరించేందుకు బోటులో 9 మంది యువకులు బయలు దేరారు. సముద్రంలోకి దాదాపు రెండు కిలో మీటర్లు వెళ్లాక వారు ప్రయాణిస్తున్న బోటు మరమ్మతులకి గురైంది. బోటు డ్రైవర్ ఏమైనా పరిష్కార మార్గం సూచిస్తాడా? అంటే మద్యం మత్తులో ఉన్నాడు. మొత్తానికి యువకులు నిస్సహాయంగా మారిపోయారు. ప్రపంచంలో ఏ దిక్కుకు వెళ్లినా సిగ్నల్ ఉన్నంత వరకూ ఎలాగైనా నెట్టుకు రావచ్చు. ఆ యువకులు సైతం అదే చేశారు. డయల్ 112కి కాల్ చేయడంతో కావలి రూరల్ పోలీసులు స్పందించారు. సిబ్బందితో వెళ్లి యువకులని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మొత్తానికి క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నందుకు యువకులు ఊపిరి పీల్చుకున్నారు.