రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని, ప్రజలంతా టీడీపీకి పట్టం కట్టేందుకు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. చింతపల్లిలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పంగులూరి అంజయ్య ఆధ్వర్యంలో శివ మాలధారులు ఇరుముడితో పాదయాత్ర తలపెట్టగా బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. నారా లోకేశ్ పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి చిరుమామిళ్ల మధుబాబు మాట్లాడుతూ.... ఎవరెన్ని కుట్రలు చేసినా టీడీపీ విజయాన్ని ఆపలేరన్నారు. నారా లోకేశ్ పాదయాత్రలో పోలీసులు అతిగా ప్రవర్తిస్తూ మాట్లాడనీయకుండా మైకు లాక్కొవడం సరైన పద్ధతి కాదన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్మోహన్రెడ్డి, షర్మిల పాదయాత్రకు మైకు అనుమతించిన ఘనత టీడీపీదేనన్నారు. ఈ కుట్రలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. మాలధారుల పాదయాత్రకు హారతి ఇచ్చి ప్రారంభించారు. గ్రామంలో బ్రహ్మారెడ్డి, మధుబాబులను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగించి దుశ్శాలువాలతో సన్మానించారు. ముందుగా గ్రామంలోని దొడ్డమల్లేశ్వరస్వామి ఆలయంలో వీరు పూజలు జరిపారు.