ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఈనెల 18వ తేదీన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జరగనున్న తిరునాళ్ళ మహోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కోటప్పకొండలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. నరసరావుపేట నుంచి యలమందల మీదుగా కోటప్పకొండకు చేరుకొనే రహదారిలో చేపడుతున్న నూతన వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించా రు. అనంతరం కోటప్పకొండ కింద రహదారి మధ్యలో, కోటప్పకొండ ఘాట్ రోడ్డు పక్కన పిచ్చి మొక్కలు తొలగింపు, కొండపై నూతనంగా నిర్మిస్తున్న భవనాలను పరిశీలించారు. అనంతరం అధికారులతో తిరునాళ్ల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. తిరునాళ్ళకు సుమారు 15 లక్షల మంది భక్తులు రానున్నారని, భక్తులకు అవసరమైన తాగు నీరు, పారిశుధ్య పనులు సమృద్దిగా ఏర్పాటు చేయాలని సూచించారు. కోటప్పకొండ నుంచి జేఎనటీయూ మీదుగా నూతనంగా నిర్మిస్తున్న రహదారిని పరిశీలించారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత, పంచాయతీ రాజ్, అటవీ, దేవదాయ, రహదారులు భవనాలు, మునిసిపల్ తదితర శాఖల అధికారులందరూ సమష్టి కృషితో తిరునాళ్ళను విజయవంతం చేయాలని కోరారు. తిరునాళ్లకు వివిధ రహదారుల నుంచి భారీ విద్యుత ప్రభలు కొండకు చేరుకోనున్న నేపథ్యంలో ఆర్ అండ్ బీ శాఖ, పోలీసు, విద్యుత శాఖ అధికారులు సమన్వయంతో ప్రభల నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.