కృష్ణా జిల్లాలో ఒక ప్రమాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రికూతుళ్లు ఇద్దరు బైక్పై వెళ్తున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ... మరికాపట్లో గమ్యానికి చేరుకుంటారనగా.. వారికి అనుకోని ప్రమాదం ఎదురైంది. ఉన్నట్టుండి బైక్ నడుపుతున్న తండ్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వారిరువురూ రోడ్డు ప్రమాద బారిన పడ్డారు. వివరాల్లోకి వెళ్ళితే... గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఓ బైక్ అదుపుతప్పి బుడమేరు వంతెనను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న తండ్రికూతురు తీవ్రంగా గాయపడ్డారు. గన్నవరం నుంచి విజయవాడకు తండ్రీకూతురు వెళ్తుండగా... తండ్రికి ఒక్కసారిగా ఫిడ్స్ వచ్చాయి. దీంతో బైక్ అదుపు తప్పి వంతెనను ఢీకొనడంతో... పక్కనే కాలువలోకి తండ్రికూతురు పడిపోయారు. తండ్రి సక్కుర్తి వీరాంజనేయులు పరిస్థితి విషమంగా ఉండగా.. కుమార్తె సక్కుర్తి మానసకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరినీ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.