ఉద్యోగం కోల్పోయిన వారికి ఇచ్చే ప్యాకేజీలో పొరపాటున కోత విధించినందుకు క్షమాపణలు చెబుతూ వారికి ఈమెయిల్స్ గూగుల్ యాజమాన్యం పంపించింది. ఇటీవల గూగుల్ ఏకంగా 12 వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. కమ్ముకొస్తున్న ఆర్థికమాంద్యం నేపథ్యంలో ఉద్యోగాల్లో కోత తప్పదని అప్పట్లో సంస్థ ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ పరిహారం కింద సెవరెన్స్ ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఉద్యోగం కోల్పోయిన వారికి కంపెనీ స్టాక్స్(వాటాలు) కేటాయించింది.
అయితే..ఇలా కేటాయించిన స్టాక్స్‌లో కోత విధించినట్టు గూగుల్ పొరపాటున మాజీ ఉద్యోగులకు ఈమెయిల్స్ పంపించింది. పరిహారం లెక్కింపులో అనుకోకుండా జరిగిన పొరపాటుతో ఈ పరిస్థితి తలెత్తింది. కానీ..అసలు విషయం తెలియక ఉద్యోగులు తమ పరిహారంలో కోత పడిందనుకుని ఆందోళన చెందారు. ఈలోపు..జరిగిన తప్పును గుర్తించిన గూగుల్ వారికి క్షమాపణలు చెబుతూ ఈమెయిల్స్ పంపించింది.