కార్మికులను డిక్సన్ పరిశ్రమకు తీసుకెళుతున్న బస్సులోకి ఎక్కిన లోకేశ్... బస్సులో ఉన్న మహిళా కార్మికులను చూసి మురిసిపోయారు. నాడు డిక్సన్ పరిశ్రమను ఏపీకి తీసుకువచ్చింది తానే అని, ఇవాళ డిక్సన్ పరిశ్రమలో పనిచేసేందుకు వెళుతున్న ఈ సోదరీమణులను చూస్తుంటే హృదయం ఉప్పొంగిపోతోందని లోకేశ్ ట్వీట్ చేశారు. ఇదిలావుంటే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన డిక్సన్ టీవీ పరిశ్రమ కార్మికులను కలుసుకుని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
డిక్సన్ పరిశ్రమ యాజమాన్యం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టిందని, ఈ పరిశ్రమతో 1000 ప్రత్యక్ష ఉద్యోగాలు లభించాయని, పరోక్షంగా 5 వేల మందికి ఉపాధి లభించిందని నారా లోకేష్ వెల్లడించారు. "గత నాలుగేళ్లలో ఇలాంటివి ఎక్కడైనా సీఎం జగన్ తీసుకువచ్చాడా... ఒక్క ఉద్యోగమైనా కల్పించాడా అని చాలెంజ్ చేస్తున్నా" అని లోకేశ్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా లోకేశ్ పంచుకున్నారు.