ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామాపై బీజేపీ స్పందించింది. కన్నా లక్ష్మీ నారాయణకు ఆయన రాజకీయ స్థాయికి అనుగుణంగా బీజేపీ గౌరవం, పదవులు ఇచ్చిందని పార్టీ పేర్కొంది. ఆయనను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా చేశామని తెలిపింది. ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై కన్నా లక్ష్మీ నారాయణ మీడియాలో చేసిన అన్ని ప్రతికూల వ్యాఖ్యలను బీజేపీ తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ప్రజాభిమానం, ప్రజా మద్దతు లభిస్తున్న తరుణంలో, ఈ ప్రతికూల వ్యాఖ్యలు బీజేపీని దెబ్బతీయడానికి ఉద్దేశించినదిగా పార్టీ భావిస్తోందని తెలిపింది. ఏపీ బీజేపీలో ఇటీవల తీసుకున్న అన్ని సంస్థాగత నిర్ణయాలు, మార్పులు, బీజేపీ జాతీయ నాయకత్వంతో చర్చించి సమ్మతితో చేయబడ్డాయని బీజేపీ నాయకత్వం పేర్కొంది. బీజేపీ రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు నాయకత్వంపై పూర్తి విశ్వాసం కలిగి ఉన్నామని పార్టీ పెద్దలు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో ఉన్నామని బీజేపీ పెద్దలు స్పష్టం చేశారు.