పల్నాడు జిల్లా, నరసరావుపేట మండలంలోని కోటప్ప కొండలో ఈనెల 18న జరగనున్న మహాశివరాత్రి తిరునాళ్ల సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా పోలీసుశాఖ అన్ని చర్యలు తీసుకున్నట్టు పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... 2500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 25 మీటర్లకు ఒక పోలీసును భద్రత నిమిత్తం ఏర్పాటు చేశామన్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అంతరాయం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. మార్గమధ్యలో ఆగి పోయిన వాహనాలను తొలగించటానికి జేసీబీలు, ప్రొక్లైనర్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నరసరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్ళటానికి యలమంద, గురవాయపాలెం నుంచి వచ్చే వారు స్నానాల ఘాట్ పక్కన గల నర్సరీ మార్గం ద్వారా యాదవుల సత్రం పక్కన గల జనరల్ పార్కింగ్‌కు చేరుకోవాలన్నారు. నరసరావుపేట వెళ్ళటానికి చిలకలూరిపేట మేజరు కెనాల్ పై ఏర్పాటు చేసిన రూట్‌లో మాత్రమే వెళ్ళాలన్నారు. గురవాయపాలెం, యలమంద మీదుగా అనుమతి లేదన్నారు. వీఐపీ పాసు ఉన్నవారు, నరసరావుపేట వైపునుంచి వచ్చేవారు పెట్లూరివారిపాలెం గ్రామం మీదుగా ఘాట్ రోడ్డు పక్కన గల వీఐపీ పార్కింగ్‌లో వాహనాల పార్కింగ్ చేసుకొని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే కొండ పైకి చేరుకోవాలన్నారు. వీఐపీ, జనరల్ పార్కింగ్ నుంచి తిరిగి వెళ్ళే ట్రాఫిక్ కొండకావూరు, పమిడిమర్రు మీదుగా జేఎన్‌టీయూ వద్ద నరసరావుపేట, వినుకొండ హైవే పైకి చేరుకొని తిరిగి వెళ్ళాలన్నారు. చీరాల, బాపట్ల, గుంటూరు, ఒంగోలు నుంచి కోటప్పకొండకు వచ్చే ప్రజలు చిలకలూరిపేట, పురుషోత్తమపట్నం, పోతవరం, మద్దిరాల, ఎడవల్లి, యూటీ జంక్షన్, శారదా ఫార్మసీ కళాశాల వద్ద పార్కింగ్‌కు చేరుకోవాలన్నారు. కోటప్పకొండ నుంచి తిరిగి వెళ్ళే వారు చీరాల, బాపట్ల, గుంటూరు, ఒంగోలు, చిలకలూరిపేట వెళ్లే వారు యూటీ జంక్షన్ నుంచి కట్టుబడివారిపాలెం, కమ్మవారిపాలెం గ్రామాల మీదుగా చెరువు రోడ్డులో చిలకలూరిపేట మీదుగా వెళ్ళాలన్నారు. సంతమా గులూరు మండలం, అద్దంకి మండలం నుంచి స్వామి దర్శనానికి వచ్చే వారు మన్నెపల్లి, లక్ష్మీపురం, పెట్లూరివారిపాలెం మీదుగా ఘాట్ రోడ్డు పక్కన గల జనరల్ పార్కింగ్‌కు వెళ్ళాలన్నారు. సంతమాగులూరు మండలం, అద్దంకి మండలం నుంచి ప్రభల వద్దకు వచ్చేవారు మన్నెపల్లి, తంగేడుమల్లి, గురిజే పల్లి, యూటీ గ్రామాల మీదుగా ప్రభల నిధికి చేరుకోవాలన్నారు. మన్నెపల్లి నుంచి కోటప్పకొండ వైపు ట్రాఫిక్ అనుమతించ బడదన్నారు. ఏఎంరెడ్డి కళాశాల ఎదురుగా గల చెక్ పోస్టు నుంచి కోటప్పకొండ వైపు వాహనాలకు అనుమతి లేదన్నారు. చిలకలూరిపేట నుంచి ప్రభల వద్దకు వచ్చే ట్రాఫిక్ ఎడవల్లి నుంచి అట్టల ఫ్యాక్టరీ ఎదురు గల రోడ్డు నుంచి కట్టుబడివారిపాలెం మీదుగా ప్రభల నిధి వద్దకు చేరుకోవాలన్నారు. చిలకలూరిపేట నుంచి వీఐపీ పాసు ఉన్నవారు యూటీసెంటర్ నుంచి స్పెషల్ మార్గంలో వీఐపీ పార్కిం గ్‌కు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ బిందు మాధవ్, రాజు, డీఎస్పీ విజయభాస్కరరావు, రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డిలు పాల్గొన్నారు.