రోడ్ షోలు, ర్యాలీలు సభలకు అనుమతి నిరాకరిస్తూ జగన్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా తీసుకువచ్చిన జీవో-1ను వ్యతిరేకిస్తూ ఐక్య పోరాటం చేయాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బస్సు యాత్రకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇటీవల విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రెండు పార్టీల ఉమ్మడి సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆ పార్టీ నేతలు జల్లి విల్సన్, అక్కినేని వనజ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతోపాటు ఆ పార్టీ నేతలు వై.వెంకటేశ్వరరావు, సీహెచ్.బాబూరావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై ఈ సమావేశంలో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.