మహిళా సాధికారిత, యువతకు ఉపాధి అవకాశాలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కురుపాం నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజు అన్నారు. భీమిలి జోన్ 3వ వార్డు అప్పికొండ వీధిలో వార్డు కార్యదర్శి అప్పికొండ నూకరాజు ఆధ్వర్యంలో ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు ముఖ్య అతిధిగా విచ్చేసి స్థానికులతో మాట్లాడారు. యువతకు ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళవలసిన అవసరం వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కుల వృత్తులు చేసుకొనే వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసేవారని అన్నారు. నేడు ఆ అవకాశమే లేకుండా పోయిందని అన్నారు. వంట గ్యాస్, కరెంటు బిల్లులు, చమురు ధరలు, ప్రజలు నిత్యం వాడే వస్తువుల ధరల పెరుగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏనాడు లేదని, కానీ నేడు సామాన్యుడు బ్రతకాలంటేనే సవాలుగా మారిందని అన్నారు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని మహిళలు, యువత, యావత్ ప్రజలందరూ భావిస్తున్నారని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మెరుగైన పాలన సాగుతుందని అందరూ భావిస్తున్నారని అన్నారు. అందుకోసం నేటినుండే మనందరం కలసికట్టుగా పనిచేయాలని ప్రజలకు గంటా నూకరాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కార్యదర్శి అప్పికొండ నూకరాజు, అప్పికొండ నర్సింగరావు, ఎ. శ్రీను, ఎమ్. శ్రీను, ఎ. సాయి, పైలా సతీష్, చంటి, ఎ. సురేంద్ర, జె. పాపారావు, ఎ. వైకుంఠం, కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.