పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ నాయకత్వంలో సీపీఐ రాష్ట్ర బృందం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండు సెంటర్ నుంచి మోటారుసైకిళ్లు, కార్లతో ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీశ్రేణులనుద్దేశించి రామకృష్ణ మాట్లాడుతూ.... పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లడానికి తమకు అనుమతి ఉందని, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబుకు ఎమ్మెల్సీ జల్లి విల్సన్ లెటర్ ఇచ్చారని, ఈఎన్‌సీ నారాయణరెడ్డిని కూడా కలిశామని, వారి అనుమతితోనే పోలవరం వెళుతున్నామన్నారు. రైతు సంఘం జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలపై ఢిల్లీలోనే తాడోపేడో తేల్చుకుంటామన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేసిన నిర్వాసితులను గాలికి వదిలేస్తారా అంటూ ప్రధాని మోదీ, సీఎం జగన్మోహనరెడ్డిపై విమర్శలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు సాధన కోసం తొలుత ఉద్యమబాట పట్టిన ఏకైక పార్టీ సీపీఐ అని అన్నారు. పోలవరం పోరు యాత్రలో సీపీఐ అగ్రనాయకులు అక్కినేని వనజ, జి.ఓబులేశు, జల్లి విల్సన్, జి.ఈశ్వరయ్య, డి.జగదీష్, కేవీవీ ప్రసాద్, కామేశ్వరరావు, డేగ ప్రభాకర్, దుర్గాభవానీ, విమల, కృష్ణచైతన్య, చలసాని రామారావు, బి.కొండలరావు, బండి వెంకటేశ్వరరావు, జమలయ్య, కూండ్రపు రాంబాబు, వి.కొండలరావు, జ్యోతిరాజు ఉన్నారు.