తెలుగు భాషకు ప్రాచీన హోదా దక్కినా, దశాబ్ద కాలం పాటు ఫలితం లేకుండా పోయింది. తొలుత కేంద్రంలో కదలిక లేకపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన సమయంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది. దీనిని ఎటూ తేల్చకుండా కొంతకాలం గడిచిపోయింది. చివరకు మైసూర్ కేంద్రంగా దానిని ఏర్పాటు చేసేందుకు భారతీయ భాషా సంస్థ నిర్ణయం తీసుకుంది. 2018 డిసెంబర్‌లో మైసూరులో కన్నడ భాషతో కలిపి అధ్యయన కేంద్రం ఏర్పాటయ్యింది. ఎన్నో ప్రయత్నాల అనంతరం, ఆ కేంద్రాన్ని 2019 చివరిలో నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రాంతానికి తరలించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్ భవనంలో 2020 జనవరిలో దానికి ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు. ఈ జాప్యం వల్ల ప్రాచీన తెలుగు హోదా ఫలితాలు అందకుండాపోయాయి.