రాష్ట్రాన్ని సరైన గాడిలో పెట్టగల సత్తా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి, చంద్ర బాబు సీఎంగా బాధ్యతలు చేపడతారని టీడీపీ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం అన్నారు. పెనుగంచిప్రోలు మునేటి అవతల వైపున శ్రీనూతలపాటి కన్వెన్షన్ హాల్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, విసుగు చెందిన జనం వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్కు తగిన గుణపాఠం చెపుతారని హెచ్చరించారు. సంక్షేమం, అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎక్కడైనా అధికారం ఉన్న పార్టీలోకి ఇతర పార్టీల నేతలు చేరడం సహజమని, అందుకు భిన్నంగా ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలే టీడీపీలోకి వలసలు కడుతున్నారన్నారు. మాజీ ఎంపీపీ వేగినేటి గోపాలకృష్ణమూర్తి పాల్గొన్నారు.