ఈ పర్యాయం ఎమ్మెల్సీగా అవకాశం వస్తుందని ధీమాగా ఉన్న అశావహులు ఢీలాపడ్డారు. అంతేగాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇంకెవరూ లేనట్లు పార్టీకోసం ఆరంభం నుంచి కష్టపడిన వారిని పక్కనబెట్టి టీడీపీ నుంచి వచ్చిన వారికే అవకాశం ఇవ్వటం ఎంతవరకు న్యాయమంటూ ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. గతంలో జగన్ పాదయాత్రకు వచ్చిన సందర్భంలో అప్పటివరకు పర్చూరు ఇన్‌చార్జిగా ఉన్న గొట్టిపాటి భరత్‌కు ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వలేకపోతున్నానని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి టిక్కెట్ ఇవ్వని మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికీ అలాంటి హామీనే ఇచ్చారు. కనిగిరిలో సీనియర్ నాయకుడు ముక్కు కాశిరెడ్డి, ఆర్యవైశ్య నేతలు, చీరాల మాజీ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌కు ఎమ్మెల్సీ హామీ ఉంది. ఇటీవల పర్చూరు ఇన్‌చార్జి పదవి నుంచి తొలగించిన రామనాథంబాబు కూడా ఎమ్మెల్సీ పదవి కోసం ఎదురుచూశారు. ఇక వీరుకాకుండా ఆరంభం నుంచి జిల్లాలో పార్టీ కోసం కష్టపడిన పలువురు ఆపదవిని ఆశిస్తున్నారు. కానీ వారెవ్వరికీ కాకుండా సునీతకే రెండోసారి అవకాశం ఇవ్వటం గమనార్హం. గతంలో పార్టీ ఫిరాయింపులను విమర్శించిన జగనే ఇప్పుడు చేస్తున్నదేంటని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. ఇలా ఉండగా మాజీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డికి కూడా 2023లో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని దర్శి ఎమ్మెల్యే టిక్కెట్‌పై ఆశపెట్టుకోవద్దని జగనే స్పష్టంగా చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనకూ అవకాశం ఇవ్వలేదు. దీంతో దర్శి టిక్కెట్‌పై వైసీపీలో రగులుతున్న రగడకు మరింత ఊతం లభించిన ట్లైంది.