సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగు భాష సాహిత్య, సాంస్కృతిక చరిత్ర అధ్యయనానికి మరిన్ని నిధులు అవసరమని భాషాభిమానులు కోరుతున్నారు. అయితే, దానికి సంబంధించిన ప్రక్రియ కొంత పూర్తి చేయాల్సి ఉందని నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు ఆచార్య మునిరత్నం నాయుడు బీబీసీకి చెప్పారు.
"తెలుగుభాషకు ఉన్న చారిత్రక సంపదను వెలికితీయడానికి చాలా కృషి జరగాలి. దానికి అనుగుణంగా అధ్యయన కేంద్రానికి నిధులు రావాలి. స్వయం ప్రతిపత్తి వస్తే ఫలితం ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో సొంత భవనం నిర్మించవచ్చు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాము. అవన్నీ కార్యరూపం దాలిస్తే త్వరలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతాయి. ప్రస్తుతం మైసూర్‌లో ఉన్న ముద్రణ విభాగం సహా పలు రంగాలు సిద్ధం అవుతాయి" అన్నారు.