విజయవాడ వాంబేకాలనీలో చనిపోయిన ఓ అనాథ వృద్ధురాలికి తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించి నున్న పోలీసు స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు తన మానవత్వాన్ని చాటుకుని శభాష్ పోలీసు అనిపించుకున్నారు. ఎర్రగళ్ల లక్ష్మీ (70) అనే వృద్ధురాలు ఐదేళ్ల క్రితం వాంబేకాలనీకి వచ్చింది. బంధువులెవరూ లేకపోవడం ఎక్కడి నుంచి వచ్చిందో తెలీకపోయిన కాలనీవాసులు ఆమెను ఆదరించారు. ఇళ్ల అరుగులపై నిద్రిస్తూ, స్థానికులు పెట్టే అన్నం తింటూ కాలం వెళ్లదీసేది. అనారోగ్యంతో గురువారం ఉదయం వృద్ధురాలు మృతి చెందింది. కాలనీవాసుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసరావు అక్కడికి వెళ్లగా ఆమెకు బంధువులెవరూ లేరని, కాలనీవాసులు ఎస్సైకి చెప్పారు. దీంతో చెలించిపోయిన ఆయన వృద్ధురాలి అంత్యక్రియలను తన సొంత ఖర్చులతో నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.