‘మంత్రి సీదిరి అప్పలరాజు ఉద్దేశపూర్వకంగా నన్ను టార్గెట్ చేశారు. పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతూ వేధిస్తున్నారు’.. అంటూ వైసీపీ జిల్లా కార్యదర్శి, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దువ్వాడ హేమబాబు చౌదిరి చేసిన వ్యాఖ్యలు అధికారపార్టీలో కలకలం సృష్టించాయి. పలాస నియోజకవర్గంలో విభేదాలు మరోసారి బహిర్గతం చేశాయి. శుక్రవారం కాశీబుగ్గ-అక్కుపల్లి రోడ్డులోని కళ్యాణమండపంలో జిల్లా కాళింగ సంక్షేమ సేవాసంఘ నాయకులు, పలాస నియోజకవర్గ నాయకులు సమావేశమయ్యారు. సమావేశంలో కాళింగులకు జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకునే క్రమంలో.. మంత్రి అప్పలరాజు వర్గానికి చెందిన అదే సామాజికవర్గం నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవతో సభ రసాభాసగా మారింది. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇరువర్గాల నాయకులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.