ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి మూడో స్థానానికి ఎంత స్పీడుగా మన కుబేరుడు ఎగబాకారో అంతే స్పీడుతో కిందికి దిగజారారు. గౌతమ్ అదానీ.. ఒక సమయంలో ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నారు. కానీ, ఇప్పుడు ఆయన వద్ద కేవలం మూడింట ఒక వంతు సంపద మాత్రమే మిగిలింది. నెల రోజుల క్రితం ఆయన సంపద 130 బిలియన్ డాలర్లుగా ఉండేది. ఇప్పుడు 35 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫోర్స్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో ఆయన నెల రోజుల్లోనే 3వ స్థానం నుంచి 33వ స్థానానికి పడిపోయారు. ఇందంతా జరగడానికి కారణం హిండెన్ బర్గ్ రిపోర్ట్. జనవరి 24, 2023 రోజున షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్ బర్గ్ ఓ నివేదికను విడుదల చేసింది అదానీ గ్రూప్ కంపెనీల్లో స్టాక్స్ మానిప్యులేషన్ జరుగుతోందని, రికార్డుల్లో అవకతవకలు ఉన్నాయమని ఆరోపించింది. దీంతో అదానీ గ్రూప్ స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి.
అదానీ గ్రూప్ కంపెనీల్లో అకౌంటింగ్ ఫ్రాడ్, షేర్ల ధరలను ఎక్కువ చేసి చూపడం వంటి వివిధ రకాల ఆరోపణలు చేసింది హిండెన్‌బర్గ్ రిపోర్ట్. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 85 శాతం అధికంగా చూపుతున్నట్లు పేర్కొంది. ఇప్పుడు అదే నిజమవుతోంది. అదానీ కంపెనీల షేర్లు ఏకంగా 85 శాతం మేర పడిపోయాయి. గౌతమ్ అదానీ ఒక్కరే కాదు ఆయన ఇన్వెస్టర్లు సైతం భారీగా నష్టపోయారు. నెల రోజుల్లో అదానీతో పాటు ఇన్వెస్టర్లు ఏ స్థాయిలో నష్టపోయారో చూద్దాం.
గౌతమ్ అదానీ సంపద జనవరి 24 నుంచి ఫిబ్రవరి 24, 2023 మధ్య 127 బిలియన్ డాలర్ల నుంచి 35 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మూడింట రెండొంతుల సొమ్ము ఆవిరైపోయింది. ఇప్పుడు ఆయన వద్ద ఒక వంతు సంపద మాత్రమే ఉంది. బ్లూమ్ బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద 40 బిలియన్ డాలర్లుగా చూపుతోంది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు 85 శాతం మేర పడిపోయాయి. అదానీ ఎంటర్ ప్రైజెస్ షేరు ధర జనవరి 23న రూ.3436 వద్ద ఉండగా.. 60 శాతం కోల్పోయి ప్రస్తుతం రూ.1382.65కు పడిపోయింది. అదానీ టోటల్ గ్యాస్ 80 శాతం పడిపోయి రూ.3,901 నుంచి రూ.791కి తగ్గింది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేర్లు రూ.1932 నుంచి నెల రోజుల్లో రూ.512కు చేరింది.
ఎల్ఐసీకి నష్టాలు..
గౌతమ్ అదానీ కంపెనీల షేర్లతో భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లలో ఎల్ఐసీ ఒకటిగా నిలిచింది. అదానీకి చెందిన 5 కంపెనీల్లో ఎల్ఐసీ పెట్టుబడులు రూ.72,193.87 కోట్లుగా ఉంది. ఇప్పుడు అది రూ.26,861.88కి పడిపోయింది. మొత్తంగా 62.79 శాతం మేర నష్టపోయాయి. అదానీ కంపెనీ షేర్ల పతనం ఎస్బీఐ పైనా పడింది. ఎస్బీఐ షేరు రూ.604.60 నుంచి నెల రోజులో రూ.521కి పడిపోయింది.