వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇటీవల మనకు పరిచయమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రజల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న హైస్పీడ్ రైళ్లు ఇవి. ప్రస్తుతం ప్రధాన నగరాల మధ్య వీటిని ప్రవేశపెడుతోంది కేంద్ర ప్రభుత్వం. మన తెలుగు రాష్ట్రాలకు సైతం ఈ రైలు వచ్చింది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా అల్యూమినియం బాడీతో 100 వందే భారత్ రైళ్లను సిద్ధం చేయాలని టెండర్లు పిలిచింది. ఈ అల్యూమినియం బాడీతో 100 రైళ్ల తయారీ ప్రాజెక్టుకు ప్రస్తుతం రెండు కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. అందులో ఒకటు హైదరాబాద్‌కు చెందిని మేధా సర్వో డ్రైవ్స్ ఉండడం విశేషం. ఈ కంపెనీ స్విట్జర్లాండ్‌కు చెందిని స్టాడ్లర్‌తో సంయుక్తంగా బిడ్ దాఖలు చేసింది.
హైదరాబాద్‌కు చెందిన మేదా సర్వో డ్రైవ్స్‌తో పాటు ఈ ప్రాజెక్టు కోసం ఫ్రాన్స్‌కు చెందిన రైల్వే సంస్థ అల్‌స్తోమ్ కూడా బిడ్ వేసింది. ఈ రెండు సంస్థలు రూ.30 వేల కోట్లు విలువైన వందే భారత్ రైళ్ల తయారీ ప్రాజెక్టు కోసం బిడ్లు వేశాయి. ఈ ప్రాజెక్టు కింద 100 రైళ్లను తయారు చేయడంతో పాటు 35 ఏళ్ల పాటు వాటిని నిర్వహించాల్సి ఉంటుంది. ఇనుము, ఉక్కుతో తయారు చేసే రైళ్లతో పోలిస్తే అల్యూమినియం రైళ్లు తేలికగా ఉంటాయి. అధిక ఇంధన సామర్థ్యాన్ని ఇస్తాయి. ఈ ప్రాజెక్టు ఓకే అయితే, సోనీపేట్‌లో తయారు చేసే అవకాశాలు ఉన్నాయి.
వందే భారత్ తొలి స్లీపర్ క్లాస్ రైలును 2024 తొలి త్రైమాసికంలో తీసుకురావాలని భారతీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 102 వందే భారత్ రైళ్ల తయారీకి కాంట్రాక్టులు ఇచ్చింది. ఇవన్నీ ఛైర్ కార్ (కూర్చోవడానికి మాత్రమే) వీలుండే రైళ్లు మాత్రమే. వీటిలో ప్రస్తుతం 10 రైళ్లు వివిధ రూట్లలో సేవలందిస్తున్నాయి. మిగిలినవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వీటిని హరియాణాలోని సోనీపట్, మహారాష్ట్రలోని లాతూర్, ఉత్తర్ ప్రదేశ్‌లోని రాయ్ బరేలీలో తయారు చేస్తున్నారు.
మేధా సర్వో డ్రైవ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనేది ఎలక్ట్రికల్ సిస్టమ్స్ తయారు చేసి విక్రయిస్తుంటుంది. ముఖ్యంగా ప్రస్తుతం వందే భారత్ రైళ్లలోని ప్రపల్సన్ సిస్టమ్స్ దీని ప్రత్యేకత. అయితే, ఈ హైదరాబాద్‌కు చెందిన సంస్థకు అల్యూమినియం రైళ్లు తయారు చేసిన అనుభవం లేకపోవడం నెగెటివి డ్రా బ్యాక్. అందుకే స్విట్జర్లాండ్ మేజర్ సంస్థతో ఇది భాగస్వామ్యంతో బిడ్ దాఖలు చేసింది.