రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కొత్త రికార్డును సాధించబోతుంది. ప్రజల నుంచి నిధులు సమీకరించి స్వయం సమృద్ధి సాధించాలనే ఆలోచనతో షేర్ మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. భారీ పరిశ్రమలకు నిధులు సమీకరించే తరహాలో నగరపాలక సంస్థ రాజమహేంద్రవరం నుంచి వాటాలు సమీకరించి వృద్ధి సాధించాలని రాష్ట్రంలోనే తొలిసారిగా వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన వివరాలను కమిషనర్ కేతన్ గార్గ్ వివరించారు. ప్రజల నుంచి నిధులు సమీకరించి ముంబై స్టాక్ ఎక్సేంజీ ద్వారా గ్రీన్ బాండ్లు విక్రయిస్తారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తికి గ్రీన్ బాండ్ల పేరిట ప్రజల నుంచి రూ.45 కోట్ల నిధులు సేకరిస్తున్నట్టు తెలిపారు. నిధుల సమీకరణలో భాగంగా ఫండ్ మేనేజర్‌గా విశాఖపట్నానికి చెందిన అనురాగ్ అసోసియేట్‌ను నియమించినట్టు తెలిపారు.
గ్రీన్ బాండ్ల ద్వారా సేకరించిన నిధులు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టి నగరపాలక సంస్థ స్వయం సమృద్ధి సాధిస్తుందన్నారు. నిధు లతో 5 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంటును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇంధన వనరుల ఆదాతో పాటు కేంద్రం నుంచి 13 శాతం సబ్సిడీ లభిస్తుందని తెలిపారు. ఉత్పత్తి చేసిన విద్యుత్ నగరపాలక సంస్థ అవసరాలకు వినియోగించడంతో పాటు ఇతర అవసరాలకు వినియోగించడం వల్ల చార్జీలు అదా అవుతాయని చెప్పారు. ఎస్టీపీ ద్వారా విడుదలయ్యే నీటిని శుద్ధి చేసి పైపులైన్ల ద్వారా ఓఎన్జీసీ, గెయిల్, ఆర్‌టీసీ ,రైల్వే తదితర శాఖలకు సరఫరా చేసి ఆదా యాన్ని సాధిస్తామన్నారు. నగర పరిధిలో రోజుకు 120 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని ఇలా సేకరించే చెత్తను వేరుచేసి సీఎన్జీ తరహా రూ.100 కోట్లతో కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంటును లూధర్ గిరి ఎస్టీపీ వద్ద ఏర్పాటు చేసి ఉత్పత్తి చేసిన బయోగ్యాస్‌ను కార్పొరేషన్ వాహనాలకు విని యోగిస్తామన్నారు.ఈ మేరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటికే స్వమృద్ధిలో భాగంగా క్వారీ సెంటర్‌లో ఐవోసీఎల్ ఆధ్వర్యంలో పె ట్రోల్ బంకు ఏర్పాటు చేస్తున్నామన్నారు.