ఎర్ర చందనం అమ్మకాలు, ఎగుమతికి సింగిల్ విండో విధానం మేలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సింగిల్ విండోకు కస్టోడియన్‌గా ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ని కోరారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను సింగల్ విండో విధానానికి మార్చాలని, దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఈ – వేలం’లో మెరుగైన ఫలితాలు వస్తాయని అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రచందనం రక్షణ, స్మగ్లింగ్ నిరోధం, దుంగల అమ్మకం విషయంలో అనుసరిస్తున్న విధానాల మీద కేంద్ర మంత్రితో చర్చించారు.కేంద్ర మంత్రి దృష్టికి ఈ విషయాలను పవన్ కల్యాణ్ తీసుకువచ్చారు.