నేరగాళ్లు రూటు మారుస్తున్నారు. రోజురోజుకూ కొత్త ప్లాన్లు వేస్తున్నారు. అయితే వారెన్ని ప్లాన్లు వేసినా.. కస్టమ్స్ అధికారుల ముందు వారి ప్లాన్లు బెడిసికొడుతున్నాయి. విశాఖపట్నం విమానాశ్రయంలోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. అయితే స్మగ్లర్ల ప్లాన్ చూసి అధికారులు కూడా అవాక్కయ్యారు. సాధారణ తనిఖీల్లో భాగంగా విశాఖ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ తనిఖీల్లో థాయిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అధికారులకు ఎందుకో అనుమానం కలిగింది. దీంతో ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు. ఇందులో వారికి కేక్ బాక్సులు కనిపించాయి. అయితే అనుమానం కొద్దీ వాటిని తెరిచి చూసిన అధికారులకు దిమ్మతిరిగింది.
కేక్ బాక్సులలో అరుదైన జీవులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యవహారం బయటకు వచ్చింది. కేకు బాక్సులలో ఆరు నీలం రంగు నాలుక కలిగిన బల్లులను అధికారులు గుర్తించారు. దీంతో థాయిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ బ్యాంకాక్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఆరు అరుదైన బల్లులను స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు.. తిరిగి వాటిని థాయిలాండ్ పంపించారు. ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేశారు.వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బ్యాంకాక్ నుంచి ఇండియాలో ఎక్కడకు తరలిస్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నారు. తెలియక తీసుకువచ్చారా లేక ఈ అక్రమ రవాణా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే దానిపై ఆరా తీస్తున్నారు.
ఈ నీలం రంగు నాలుక కలిగిన బల్లులను శాస్త్రీయంగా Tiliqua scincoides scincoides అని పిలుస్తారు. ఇవి ఆస్ట్రేలియాకు చెందిన సరీసృపాలు. కీటకాలు, నత్తలు, అడవి పువ్వులు వంటి వాటిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. అయితే అంతరించిపోతున్న ఈ జీవులను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ అధికారులు వీటిని రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.