ఏక్నాథ్ షిండే ప్రకటన చాలామంది సందేహాలను నివృత్తి చేసిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి రేసులో ముందున్న దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా ఫడ్నవీస్ పేరు వినిపిస్తోంది. సీఎం ఎంపిక విషయంలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఫడ్నవీస్ స్పందించారు.మహాయుతి కూటమిలో ఎప్పుడూ ఒకరిపై మరొకరికి భిన్నాభిప్రాయాలు లేవని, ఏ విషయంలో అయినా తాము కలిసి కూర్చొని నిర్ణయాలు తీసుకున్నామన్నారు.తాము కలిసే నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలోనూ అది వర్తిస్తుందని అభిప్రాయపడ్డారు. కొంతమందిలో కొన్ని అనుమానాలు ఉన్నాయని, ఈరోజు షిండే వ్యాఖ్యలతో వారికి అర్థమై ఉంటుందన్నారు. త్వరలో తాము పార్టీ అగ్రనేతలను కలిసి నిర్ణయం (సీఎం పదవిపై) తీసుకుంటామన్నారు. మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్ నాథ్ షిండే ఇప్పటికే రాజీనామా చేశారు. అయితే, నూతన ప్రభుత్వం కొలువుదీరేంత వరకు గవర్నర్ కోరికపై షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.