ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రత్యేక సాయం విడుదల చేసింది. ఏపీ పర్యాటక రంగ అభివృద్ధి కోసం స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ (SASCI) కింద తొలివిడత నిధులు విడుదల చేసింది. సాస్కి పథకం కింద తొలి విడతగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.113.75 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ బుధవారం వెల్లడించారు. మొత్తం నిధుల్లో 66 శాతం నిధులను తొలివిడత కింద కేంద్రం విడుదల చేసిందన్న మంత్రి కందుల దుర్గేష్.. కేంద్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు. తొలి విడత కింద మంజూరైన రూ.113.75 కోట్ల నిధుల్లో 75 శాతం వినియోగించిన తర్వాత.. మిగతా 34 శాతం నిధులను విడుదల చేస్తారని కందుల దుర్గేష్ తెలిపారు.
మరోవైపు సాస్కి పథకం కింద విడుదలైన రూ.113.75 కోట్లతో గండికోటను అభివృద్ధి చేస్తామని.. అలాగే అఖండ గోదావరి పనులు చేపడతామని కందుల దుర్గేష్ వెల్లడించారు. ఏపీలో టెంపుల్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో సాస్కి నిధులు త్వరితగతిన విడుదలయ్యాయని కందుల దుర్గేష్ చెప్పారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో చెప్పిన విధంగానే గండికోటను ఇండియన్ గ్రాండ్ కేనియన్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లడించారు.
మరోవైపు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. ఈ క్రమంలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీతో పాటుగా మొత్తం ఏడు అంశాలపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ చర్చించారు. గండికోట అభివృద్ధి సహా.. ఏపీలో టెంపుల్, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం అభివృద్ధికి ఉన్న అవకాశాలను వివరించి.. సహకరించాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు.