ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్.. బుధవారం ప్రధాని మోదీని కలిశారు. పార్లమెంట్ భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై పవన్ కళ్యాణ్.. ప్రధానితో చర్చించారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను గాలికి వదిలేసిందంటూ మోదీకి వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని ప్రధానికి వివరించారు. అలాగే జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఎలా ఉపయోగిస్తామనే వివరాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజన్‌కు మోదీకి వివరించారు.
గ్రామీణ ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ జల్ జీవన్ మిషన్ పథకాన్ని తీసుకువచ్చింది. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచి నీరు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఏపీలో జల్ జీవన్ మిషన్ పథకం అమలు కోసం గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్రం రూ.23 వేల కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2000 కోట్లు మాత్రమే ఖర్చుచేసిందని ప్రధాని మోదీకి పవన్ కళ్యాణ్ వివరించారు. ఆ నిధులతో కూడా నాసిరకమైన పనులు చేశారని ఆరోపించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తయిన పనులతో ఏ మాత్రం ప్రయోజనం లేదన్న పవన్ కళ్యాణ్.. దీనివల్ల ఎవరికీ ఎలాంటి ప్రయోజనం అందలేదని పవన్ కళ్యాణ్ ప్రధానికి వివరించారు.
ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రస్తుత ఎన్డీఏ సర్కారు జల్ జీవన్ మిషన్ ఆశయాలకు తగినట్లుగా కొత్తగా పనుల్ని మొదలుపెట్టేందుకు డీపీఆర్ సిద్ధం చేసినట్లు మోదీకి వివరించారు. గ్రామీణ ప్రాంతాల వారికి 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా, పూర్తి ప్రణాళికతో దీన్ని రూపొందించినట్లు చెప్పారు. జల్ జీవన్ మిషన్ అమలు కోసం కొత్తగా రూపొందించిన డీపీఆర్ అమలు చేసేందుకు అవసరమైన అదనపు నిధులను మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని పవన్ కళ్యాణ్ కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తిపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఓవైపు పార్లమెంట్ సమావేశాలతో అత్యంత బిజీ షెడ్యూల్‌లోనూ పవన్ కళ్యాణ్‌తో మోదీ భేటీ కావడం విశేషం.