టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బూమ్రాపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రస్తుత సెలక్టర్ ఆకిబ్ జావేద్ ప్రశంసల వర్షం కురిపించాడు. బూమ్రా బౌలింగ్ అత్యంత విభిన్నంగా ఉంటుందని మ్యాచ్‌లో బ్యాటర్లను ఏమాత్రం కుదురుకోనివ్వడని కొనియాడారు. ఇటీవల ముగిసిన 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన బూమ్రా 14 వికెట్లతో టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకరిగా నిలిచిన సంగతి తెలిసిందే.శనివారం జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆకిబ్ జావేద్ మాట్లాడుతూ బూమ్రా బౌలింగ్ శైలిని ప్రత్యేకంగా అభినందించాడు. ప్రస్తుత తరంలో ఈ ప్రపంచకప్ మొత్తంలో బూమ్రా లాంటి బౌలర్ ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే అతను చాలా భిన్నమైనవాడు సాధారణ బౌలర్ కాదు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా అసాధారణంగా ఉంటుంది. బంతిని వేగంగా విలక్షణమైన శైలిలో విసరడంతో బ్యాటర్లు అతని బౌలింగ్‌లో లయను అందుకోలేరు. దానికి బూమ్రా అస్సలు అవకాశం ఇవ్వడు అని వివరించాడు.గతంలో పాకిస్థాన్ దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లు ఎంతటి ప్రభావం చూపించేవారో ఇప్పుడు బూమ్రా అటువంటి ప్రభావమే చూపిస్తున్నాడని జావేద్ అభిప్రాయపడ్డాడు.ఈ ప్రపంచకప్‌లో బూమ్రా కాకుండా, వసీం అక్రమ్, వకార్ యూనిస్‌లను ప్రతిబింబించే మరో బౌలర్ ఏ జట్టులోనైనా ఉన్నాడా చెప్పండి. అలాంటి బౌలర్లు ఇప్పుడు కనిపించడం లేదు అని అన్నాడు. 1992లో ఇమ్రాన్ ఖాన్ కెప్టెన్సీలో ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో ఆకిబ్ జావేద్ సభ్యుడిగా ఉన్నాడు.ఇదే సమయంలో గత 18 నెలలుగా పాకిస్థాన్ జట్టు ప్రదర్శనపై వస్తున్న విమర్శలను ఆకిబ్ జావెద్ తోసిపుచ్చాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 ప్రపంచకప్‌లలో పాక్ త్వరగా నిష్క్రమించడాన్ని, భారత్ చేతిలో ఓటమిని సమర్థించుకున్నాడు.భారత్-పాకిస్థాన్ మ్యాచ్ మాకు ముఖ్యమే. కానీ మేము ప్రపంచకప్‌లలో భారత్‌ను ఎప్పుడూ ఓడించలేదు. టీ20 ప్రపంచకప్‌లలో ఇరు జట్ల మధ్య రికార్డు 8-1గా ఉంది. 1975 నుంచి మేటి కెప్టెన్లు, అన్ని తరాల ఆటగాళ్లు ఆడినా ఫలితం మారలేదు. ఇక టీ20 ప్రపంచకప్‌లో మేము ఇంగ్లండ్‌తో ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయాం. నెట్ రన్ రేట్ కారణంగానే ముందంజ వేయలేకపోయాం. కాబట్టి మా క్రికెట్ నాశనమైపోయిందని చెప్పేంత పెద్ద సమస్య ఏమీ కాదు అని జావేద్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు వన్డే సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa