ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 20న పోలింగ్ జరగనుంది. అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహిస్తారు. వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్. క్రిష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేయటంతో ఈ రాజ్యసభ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే ఏపీ అసెంబ్లీలో వైసీపీ సంఖ్యా బలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే కావటంతో.. ఈ మూడు స్థానాలకు ఎన్డీఏ కూటమికి దక్కనున్నాయి. వైసీపీ పోటీ చేయని పక్షంలో మూడు స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రాజ్యసభ స్థానాల కోసం కూటమి నేతల్లో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది.
ఎంపీ పదవులకు, వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ఆ తర్వాతి కాలంలో టీడీపీలో చేరిపోయారు. ఆర్. క్రిష్ణయ్య బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తానంటూ రాజీనామా చేశారు. వీరిలో బీద మస్తాన్‌రావును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి రాజ్యసభకు పంపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మూడు రాజ్యసభ సీట్లలో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకుంటాయని సమాచారం. పార్టీ అవిర్భావం తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో రెండు సీట్లను టీడీపీ తీసుకోవాలని.. వాటిలో ఒకటి బీద మస్తాన్‌రావుకు అని ప్రచారం జరుగుతోంది. అలాగే రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం తక్కువ కావటంతో ఆ పార్టీ కూడా ఒక సీటు తమకు కావాలని కోరినట్లు తెలిసింది.
మరోవైపు రాజ్యసభ సీటు కోసం టీడీపీలోనూ చాలా మంది సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో గుంటూరు ఎంపీగా పనిచేసి.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన గల్లా జయదేవ్.. రాజ్యసభ సభ్యత్వం ఆశిస్తున్నట్లు సమాచారం. గల్లా జయదేవ్‌తో పాటుగా కంభంపాటి రామ్మోహన్‌రావు, రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి, సానా సతీష్ వంటి నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే అధినేత చంద్రబాబు నాయుడు మనసులో ఏముందనేదీ త్వరలోనే తేలనుంది. మరోవైపు రాజ్యసభ ఉప ఎన్నికలకు డిసెంబర్ మూడున నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలకు డిసెంబర్ పదో తేదీ వరకూ సమయం ఉంది. ఈ నేఫథ్యంలో వచ్చే వారం పదిరోజుల్లో అభ్యర్థులను ఖరారు చేయనున్నారు.