నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం.. తుపానుగా మారనుంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న ఈ తీవ్ర వాయుగుండం బుధవారం రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే రాయలసీమలోనూ అక్కడకక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శనివారం వరకూ మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని సూచించింది.
వచ్చే 4 రోజులు వాతావరణం వివరాలు
నవంబర్ 28
తీవ్ర వాయుగుండం, తుపాను ప్రభావంతో గురువారం నెల్లూరు, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. కాకినాడ, గోదావరి జిల్లాలు, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. అల్లూరి, విశాఖపట్నం, గుంటూరు, అనకాపల్లి, బాపట్ల, ప్రకాశం జిల్లాలలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 29
నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్ఆర్, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
నవంబర్ 30
శనివారం నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, గోదావరి జిల్లాలు, గుంటూరు, కృష్ణా, ఏలూరు, బాపట్ల, పల్నాడు, అనంతపురం, నంద్యాల, సత్యసాయి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
డిసెంబర్ 1
ఇక ఆదివారం రోజున విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, ప్రకాశం, కోనసీమ, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్మమయ్య, వైఎస్ఆర్, తిరుపతి, చిత్తూరు జిల్లాలలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మిగతా చోట్ల తేలికపాటి వర్షం కురవొచ్చని అంచనా వేశారు.