అతడు ఒకప్పుడు విదేశాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ తర్వాత భారత్‌కు వచ్చి కూడా మంచి కంపెనీలో పనిచేశాడు. లక్షల్లో జీతాన్ని సంపాదించాడు. అయితే కొన్ని ఏళ్లు తిరిగేసరికే.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సూటు బూటు వేసుకుని ఏసీ కింద కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవాల్సిన ఆ వ్యక్తి.. నడిరోడ్డుపైకి వచ్చేశాడు. పెరిగిన జుట్టు, మాసిన గడ్డం.. చిరిగిపోయిన బట్టలతో బిచ్చగాడిలా మారిపోయాడు. అయితే అతడిని కలిసి మాట్లాడిన ఓ యువకుడు.. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శరత్ యువరాజా అనే ఓ యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఓ వ్యక్తి.. ఇప్పుడు కర్ణాటక రాజధాని బెంగళూరులోని రోడ్లపై బిచ్చం ఎత్తుకుంటూ కనిపించగా.. అతడితో మాట్లాడిన శరత్ యువరాజా ఆ వీడియోను పోస్ట్ చేశాడు. ఒకప్పుడు జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో.. ఆ తర్వాత బెంగళూరులో ఓ ప్రముఖ టెక్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేసిన ఆ టెకీ.. ఇప్పుడు అదే బెంగళూరు నగరంలోని జయనగర్ వీధుల్లో భిక్షాటన చేస్తున్నాడు. అయితే తాను ఇలా కావడానికి కారణం.. మద్యానికి బానిస కావడమేనని తేల్చి చెప్పాడు.
ఇక ఆ వీడియోలో అతడు.. ఐన్‌స్టీన్ నుంచి మొదలుపెడితే ఎంతోమంది తత్వవేత్తల వరకు అందరి గురించీ ఇంగ్లీష్‌లో నాన్‌స్టాప్‌గా మాట్లాడుతూనే ఇన్నాడు. అంతేకాకుండా ధ్యానం, తత్వశాస్త్రం, సైన్స్ వంటి సబ్జెక్టులపై ఎంతో పట్టు ఉన్న వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. అయితే తన తల్లిదండ్రులు చనిపోయారని.. అప్పటి నుంచి మద్యానికి బానిస అయి.. ఇలా తయారైనట్లు చెప్పుకొచ్చాడు. తనను కనిపెంచిన తల్లిదండ్రులను కోల్పోవడంతో తాను తట్టుకోలేక మద్యం వైపు అడుగులు వేసినట్లు చెప్పాడు.
అయితే తాను ఇంకా చదుకోవాలి అని ఆ టెకీ మరో వీడియోలో చెప్పడం గమనార్హం. అయితే తాను సాయం చేయడానికి ప్రయత్నించినా.. అతడు నిరాకరించినట్లు శరత్ యువరాజా వెల్లడించాడు. అతడ్ని చూసి ఎన్జీవోలను సంప్రదించినా.. వారు పోలీసుల ప్రమేయంతోనే అతన్ని మార్చడం సాధ్యమని డాక్టర్లు అంటున్నారని చెప్పాడు. ఇక ఆ వీడియోలో నువ్వు ఏం చదువుకున్నావని శరత్ యువరాజా అడగ్గా.. తాను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని.. తాను గ్లోబల్ విలేజ్‌లోని మైండ్‌ట్రీలో పని చేసినట్లు చెప్పాడు.