ఏ వ్యక్తి అయినా సైన్యంలో చేరేముందే.. తనకు కుటుంబం కంటే దేశ భద్రతే ముఖ్యమని నిర్ణయించుకుంటారు. దేశ రక్షణ కోసం అవసరం అయితే తన ప్రాణాలు పోయినా పరవాలేదని సైన్యంలో చేరుతారు. అలాంటి జవాన్లు.. అమరులై ఇంటికి తిరిగివస్తే.. వారిని కన్నతల్లిదండ్రులకు, కట్టుకున్న భార్యకు, పుట్టిన పిల్లలకు జీవితాంతం ఆ శోకం ఉంటుంది. ఇలా దేశం కోసం సరిహద్దుల్లో పోరాడి అమరులైన సైనికుల కుటుంబ సభ్యులది ఒక్కొక్కరిదీ ఒక్కో కథ ఉంటుంది. కొన్నేళ్ల క్రితం సైన్యంలో చేరి.. అక్కడే ప్రాణాలు విడిచిన ఓ జవాన్ కుమార్తె పెళ్లి తాజాగా జరిగింది. అయితే ఆ పెళ్లికి సీఆర్పీఎఫ్ జవాన్లే పెద్ద దిక్కు అయ్యారు. వారే పెళ్లి కుమార్తె తండ్రి స్థానంలో ఉండి కార్యక్రమాలు జరిపించారు. కన్యాదానం చేసి ఆ పెళ్లిని పూర్తి చేసి.. ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
హర్యానాలోని జింద్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఛాతర్ గ్రామానికి చెందిన సతీష్ కుమార్ అనే సీఆర్పీఎఫ్ జవాన్.. జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో విధులు నిర్వహిస్తుండగా.. 2015 మార్చి 20వ తేదీన అమరుడయ్యాడు. ఈ క్రమంలోనే ఇటీవల సతీష్ కుమార్ కుమార్తె నిషా పెళ్లి శనివారం జరిగింది. ఈ క్రమంలోనే సీఆర్పీఎఫ్ జవాన్ల బృందం.. నిషా పెళ్లికి హాజరయ్యారు. కేవలం హాజరుకావడమే కాకుండా.. తమలో ఒకడిగా దేశానికి సేవ చేస్తూ.. అమరుడైన సతీష్ కుమార్ స్థానంలో.. వారే పెళ్లి పెద్దలు అయ్యారు.
సీఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది.. నిషా పెళ్లికి హాజరై.. సతీష్ కుమార్ లేని లోటును తీర్చారు. ఆ టీమ్‌లోని ఓ సీఆర్పీఎఫ్ అధికారి.. వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఈ పెళ్లికి ఆ గ్రామ ప్రజలు అంతా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించి.. ఘనంగా వారిని సాగనంపారు. సీఆర్పీఎఫ్ డీఐజీ కోమల్ సింగ్, డిప్యూటీ కమాండెంట్ వేద్‌పాల్, అసిస్టెంట్ కమాండెంట్ కృష్ణ కుమార్ సహా సోనిపట్‌లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్‌లో ఉండే ఇతర సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఆ పెళ్లిని ఘనంగా జరిపించారు. అది చూసి సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు, బంధువులతోపాటు ఛాతర్ గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.