ఓ గిరిజనుడిపై నాటు తుపాకీతో దుండగుడు మూడు రౌండ్లు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన గిరిజనుడిని కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. మండలంలోని దుగ్గి గ్రామానికి చెందిన బిడ్డిక లక్కాయి అనే గిరిజనుడు సోమవారం సాయంత్రం అడవి నుంచి మేకలు తోలుకొని ఇంటికి చేరుకున్నాడు. ఆరుబయట కొళాయి వద్ద స్నానం చేస్తుండగా ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి నాటు తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన లక్కాయిని కుటుంబసభ్యులు హుటాహుటిన సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు, అక్కడి నుంచి విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై దోనుబాయి ఎస్ఐ మస్తాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మంగళవారం పాలకొండ డీఎస్పీ రాంబాబు.. దుగ్గి గ్రామాన్ని సందర్శించి గ్రామస్థుల నుంచి వివరాలను సేకరించారు. గ్రామంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఈ సంఘటన ఆనోట ఈనోట వ్యాపించడంతో సీతంపేట ఏజెన్సీలో భయానక వాతావరణం నెలకొంది.