ఇద్దరు యువకులు ఓ ఉడుమును పట్టుకున్నారు. దీని మాంసం తింటే ఆరోగ్యానికి మంచిదంటూ వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఈ వీడియో చూసిన ఓ జంతు సంరక్షణ సంస్థ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ ఇద్దరి యువకులను అధికారులు అరెస్టు చేశారు. ఈ వివరాలను మంగళవారం పార్వతీపురం రేంజర్ బిల్లంగి రామనరేష్ విలేకరులకు వెల్లడించారు. పార్వతీపురం మండలం పెదమరికి పంచాయతీ బండిదొరవలస గ్రామానికి చెందిన చీమల నాగేశ్వరరావు, ఎలకల నానిబాబు అనే ఇద్దరు యువకులు ఇటీవల తమ గ్రామ సమీప పొలాల్లో ఉడుమును వేటాడారు. దీని మాసం తింటే నడుం నొప్పి పోతుందని ఫోన్లో వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.
అనంతరం ఉడుమును వండుకుని తిన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీనిపై స్ర్పే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 25న రాత్రి నాగేశ్వరరావు, నానిబాబును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచ్చారు. నాగేశ్వరరావు గ్రామ సచివాలయ లైన్‌మన్‌గా పార్వతీపురం మండలం లక్ష్మీనారాయణపురంలో పనిచేస్తున్నారు. వన్యప్రాణులను వేటాడడం నేరమని, ఇటువంటి ఘటనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని రేంజర్ రామనరేష్ హెచ్చరించారు. వన్య ప్రాణులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ సబ్ డీఎఫ్‌వో వై.సంజయ్, పార్వతీపురం ఫారెస్ట్ అధికారి మనోజ్ తదితరులు పాల్గొన్నారు.